అవినాష్ ముందస్తు బెయిలు రద్దుపై సుప్రీం విచారణ ఎప్పుడంటే?

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ డాక్టర్ సునీత వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది. ఈ కేసులో అవినాష్‌ ప్రధాన కుట్రదారు అని సునీత తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడిరచారు. అవినాష్‌కు కొందరు ప్రభుత్వ పెద్దల నుంచి సహాయసహకారాలు అందుతున్నాయని ఆరోపించారు. సీబీఐ విచారణను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ డాక్టర్ సునీత ఆ పిటిషన్ లో  పేర్కొన్నారు. 

ఏపీ సర్కార్ కూడా అవినాష్‌కే మద్దతిస్తోందని, మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానే  ముందస్తు బెయిలు విషయంలో హైకోర్టు తీర్పు ఇచ్చిందని  సునీత పేర్కొన్నారు.  ఏప్రిల్‌ 24 తర్వాత సీబీఐ నాలుగుసార్లు సమన్లు జారీ చేసిందని.. అవినాష్‌ ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వేసవి సెలవుల్లో తెలంగాణ హైకోర్టు అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలను విని గత నెల 31న తీర్పు వెలువరించింది. షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న అవినాష్‌రెడ్డిని సీబీఐ ఇటీవల అరెస్ట్‌ చేసి, రూ.5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులను తీసుకొని వెంటనే విడుదల చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ నేపథ్యంలోనే సునీత పిటిషన్ పై సుప్రీం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి బెయిలు పిటిషన్ పై వాదనల సందర్భంగా సీబీఐ కీలక అంశాలను వెల్లడించింది. తొలి సారిగా అవినాష్ ను వివేకా హత్య కేసులో నిందితుడిగా పేర్కొంది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిలు రద్దు కోసం సునీత పిటిషన్ ప్రాధాన్యత సంతరించుకుంది.