మాగుంట మధ్యంతర బెయిలు రద్దు.. 12న లొంగిపోవాలని సుప్రీం ఆదేశం
posted on Jun 9, 2023 2:53PM
ఊరట దక్కిన ఆనందం రోజులైనా నిలువలేదు. మాగుంట రాఘవకు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిలును దేశ సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఢిల్లీ హైకోర్టు మాగుంట రాఘవకు మధ్యంతర బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడైన రాఘవ తన అమ్మమ్మకు ఆరోగ్యం బాలేదంటూ ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించి బెయిలు పొందారు. అయితే అమ్మమ్మ బాత్ రూంలో జారిపడిన కారణంగా బెయిలు మంజూరు చేయడం సబబు కాదని ఈడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అమ్మమ్మను రాఘవ ఒక్కరు మాత్రమే చూసుకోవలసిన అవసరం లేదని ఈడీ సుప్రీం కోర్టులో వాదించింది. అయితే ఈ దశలో జోక్యం చేసుకున్న రాఘవ తరఫు న్యాయవాది ఢిల్లీ హైకోర్టు రెండు వారాల మాత్రమే బెయిలు ఇచ్చిందని పేర్కొన్నారు.
అంతే కాకుండా ఒక సారి నాయనమ్మ అనీ, మరో సారి అమ్మమ్మ అనీ, ఇంకో సారి భార్య ఆత్మహత్యా యత్నం చేశారనీ రాఘవ బెయిలు పిటిషన్ లో పేర్కొన్నారని ఈడీ తరఫు న్యాయవాది సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
వాదోపవాదాలు విన్న అనంతరం సర్వోన్నత న్యాయస్థానం మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిలును రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా మాగుంట రాఘవ మధ్యంతర బెయిలుపై రెండు రోజుల కిందట విడుదలయ్యారు. దీంతో ఈ నెల 12న లొంగిపోవాలని రాఘవకు ఆదేశించింది.