అలుపెరుగని పోరాటానికి చిరునామా!

గత నాలుగున్నరేళ్లుగా  వైఎస్ వివేకా హత్య కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. హత్య జరిగిన వెంటనే ఆరోపణలు గుప్పించిన వాళ్లే ఇప్పుడు నిందితులుగా, అనుమానితులుగా బోనులో నిలబడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్నవారికి ఆ కేసుతో  ఏం సంబంధం లేదని  విస్పష్టంగా తేలిపోయింది. అప్పట్లో నారాసుర రక్త చరిత్ర అంటూ ఆరోపణలు గుప్పించిన వారే ఇప్పుడు వివేకా హత్య కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్నారు. నిందితులుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అరెస్టయ్యారు. బెయిలుపై తిరుగుతున్న వారూ ఉన్నారు. ముందస్తు బెయిలుతో అరెస్టులను తప్పించుకుంటున్నారు.

 అసలు వివేకా హత్య కేసు దర్యాప్తు నాలుగున్నరేళ్లుగా ఎందుకు సాగుతూ వస్తోంది. ఆ కేసు ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు చందంగా సాగడానికి కారకులెవరు అన్న విషయంలో కూడా సందేహాలు నివృత్తి అయిపోయాయి. కారకులెవరు? హత్య లో పాత్రధారులు, సూత్రధారులు ఎవరు అన్న విషయం కోర్టులో ఇంకా పూర్తిగా తేలకపోయినా.. ప్రజలలో మాత్రం ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.   రాష్ట్రంలో అందరికీ వివేకా హత్య మోటో ఏమిటి? చేసిందెవరు? చేయించిందెవరు? అన్నవిషయంలో  ఎలాంటి సందేహాలూ లేవు. అసలీ కేసు ఇంత వరకూ వచ్చి.. ఒక లాజికల్ ఎండ్ దిశగా సాగుతోండడానికి కారణం మాత్రం ఒకే ఒక్కరు. ఆమె హతుడు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.  తన తండ్రి  హంతకులు, వారి వెనుకనున్న ముసుగువీరుల సంగతి తేల్చాలంటూ డాక్టర్ సునీత చేసిన, చేస్తున్న న్యాయ పోరాటం   నిస్సందేహంగా  చారిత్రాత్మకం.

ఆమె అలుపెరుగని పోరాటం ఫలితమే నేడు వివేకా హత్య కేసు ఒక లాజికల్ ఎండ్ కు వస్తున్నదనడంలో సందేహం లేదు. అమె పట్టుబట్టిన కారణంగానే వివేకా  హత్య సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్నది వెలుగులోకి వచ్చే దిశగా కేసు దర్యాప్తు సాగుతోంది.  ఒక మహిళగా, ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా, న్యాయం కోసం సునీత చేసిన, చేస్తున్న  పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే.   అయితే వ్యవస్థలను మేనేజ్ చేయడంలోనూ, నిర్వీర్యం చేయడంలోనూ  అధికార వైసీపీ ఈ నాలుగున్నరేళ్లలో సిద్ధహస్తురాలిగా మారిపోయింది. ఆ కారణంగానే కేసు దర్యాప్తు వేగాన్ని మందగించేలా చేయడానికి చేయగలిగినంతా చేసింది. విపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తును డిమాండ్ చేసిన జగన్.. అధికారంలోకి రాగానే  కేంద్రదర్యాప్తు సంస్థ అవసరం లేదన్నారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. కేసును నిర్వీర్యం చేయడానికి అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎంతగా ప్రయత్నించిందో.

సరే కేవలం సునీత న్యాయపోరాటం కారణంగానే కేసు సీబీఐ చేతికి వెళ్లి .. రాష్ట్రం దాటి తెలంగాణలో విచారణకు వచ్చింది. ఇక్కడా కేసులో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత వత్తాసుగా నిలిచింది. ఇందుకు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు గైర్హాజరవ్వడాన్ని సమర్ధిస్తూ వీలైనప్పుడు వస్తారు? ఆయనేమైనా ఉగ్రవాదా? అంటూ మీడియా ముఖంగా  ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల మాటలే నిదర్శనం.  ఇక తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సునీత సుప్రీం ను ఆశ్రయించారు.   దీంతో ఇప్పుడు అందరి దృష్టీ సుప్రీం నిర్ణయం ఎలా ఉంటుందన్నదానిపై ఉంది.