వారాహి వచ్చేస్తోంది.. ఇది సినిమా కాదు గురూ!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలకు కొత్త కాదు. రాజకీయ యాత్రలకూ కొత్త కాదు. కానీ ఇంతవరకు ఆయన సాగించిన రాజకీయ యాత్రలకు  జూన్  14 నుంచి  చేపట్టనున్న వారాహి యాత్రకు మధ్యన చాలా చాలా తేడా వుంది. ఇంతవరకు ఆయన  రాజకీయ కార్యకలాపాలలో భాగంగా ప్రజల్లోకి వెళ్లారు. ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను ఆదుకునేందుకు జిల్లాల వారీగా కౌలు రైతు భరోసా యాత్ర చేశారు. అంతకు ముందెప్పుడో  శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు అలాంటి  యాత్రే  చేశారు.

అలాగే ఇటీవల అకాల  వర్షాల వలన నష్ట పోయిన రైతులను పరామర్శించేందుకు పరామర్శ యాత్ర చేశారు. అంతకు ముందు తర్వాత కష్టాల్లో ఉన్న విభిన్న వర్గాల ప్రజలను ఆదుకునేందుకు ఆయన యాత్రలు చేశారు.  అయితే ఇంతవరకు పవన్ కళ్యాణ్ సాగించిన యాత్రలు ఒక నిర్దిష్ట లక్ష్యంతో సాగించిన యాత్రలు. ఒక విధంగా చూస్తే పవన్ యాత్రలు చాలావరకు సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా చేసినవే కానీ  నిర్దుష్ట రాజకీయ లక్ష్యంతో చేసినవి కాదు. కానీ ఇప్పుడు జూన్ 14 నుంచి ప్రారంభిస్తున్న ‘వారాహి’ యాత్ర  గతంలోలా పరిమిత లక్ష్యంతో ప్రారంభిస్తున్న యాత్ర కాదు. అందుకు పూర్తిగా భిన్నమైన యాత్ర. ఒక విధంగా ఎన్నికల సంగ్రామ యాత్ర.

సహజంగానే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  రోడ్డెక్కితే  జనం ఆయన్ని చూడడానికే అయినా తండోపతండాలుగా వస్తారు. అందులో ఇప్పుడు రాజకీయం కూడా తోడైంది కాబట్టి  పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర జన సంద్రంగా సాగుతుంది. అందులో సందేహం లేదు. ఒకప్పుడు అన్న ఎన్టీఆర్ సాగించిన చైతన్య రథయాత్ర సాగిన (నేలా ఈనిందా, ఆకాశం నెలకు దిగివచ్చిందా) రీతిలోనే పవన్ వారాహి యాత్ర కూడా జనసంద్రంగా సాగుతుంది. అనుమానం లేదు. అయితే ఎన్టీఆర్ కు వచ్చిన పొలిటికల్ మైలేజి పవన్ కళ్యాణ్ కు  వస్తుందా? అంటే, అరక్షణం ఆలోచించకుండా, నో  అన్న సమాధానమే వస్తుంది. అయినా పవన్  కళ్యాణ్ వారాహి యాత్రకి ఎంతో కొంత పొలిటికల్ మైలేజి వస్తుంది అయితే, ఎంతవరకు వస్తుందనేది  మాత్రమే ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నే. అందుకే ఇప్పుడు   పొలిటికల్ సర్కిల్స్ లో వారాహి యాత్ర హాట్ టాపిక్ అయింది. 

నిజమే ఎన్టీఆర్ చైతన్య రథ యాత్ర ఒక చరిత్ర. పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలో తెలుగునాట తిరుగులేని వటవృక్షంలా పాతుకు పోయిన కాంగ్రెస్ పార్టీని వేళ్లతో సహా పెకిలించి పారేసిన చారిత్రక యాత్ర.. ఎన్టీఆర్ చైతన్య రథ యాత్ర. ఆ యాత్రతో మరొక యాత్రను పోల్చడం దుస్సాహసమే అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర రాజకీయంగా ఎంతవరకు ప్రభావం చూపుతుంది అంటే నిస్సందేహంగా రేపటి ఎన్నికల్లో వారాహి ప్రభావం  ఉంటుందనే అంటున్నారు. అలాగే పొత్తులను ఖరారు చేయడంలోనూ వారాహి యాత్రకు వచ్చే ప్రజా స్పందన ప్రభావం ఉంటుందని  పరిశీలకులు అంటున్నారు. చివరకు ఏమి జరుగుతుంది అనేది పక్క పెడితే  వారాహి యాత్ర రాజకీయ వర్గాల్లో హీట్  పెంచుతోంది. ఇప్పటికే జనసేన మిత్ర పక్షం (?) తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  సాగిస్తున్న యువగళం పాద యాత్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత జిల్లా కడప సహా  ఎక్కడికెళితే అక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర తోడైతే, అధికార వైసేపీ పరిస్థితి దబిడి దిబిడే అంటున్నారు.

కాగా  పవన్ కళ్యాణ్ జూన్ 14వ తేదీన కత్తిపూడి జంక్షన్ నుంచి ‘వారాహి’ యాత్ర ప్రారంభిస్తారని ఆ పార్టీ రాజకీయ వ్యవహార కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. రెండు రోజుల క్రితం ఆయన గుంటూరులో  వారాహి యాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన యాత్ర వివరాలను తెలియ చేశారు. జూన్ 14న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నవరం సత్యదేవుని సన్నిధిలో  ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పత్తిపాడు నుంచి పర్యటన మొదలుపెడతారని చెప్పారు. ఈ యాత్రలో అన్ని వర్గాల ప్రజల్ని పవన్ కళ్యాణ్ కలిసేలా ప్రణాళిక రచించినట్లు వెల్లడించారు.

ఒక్కో నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పవన్‌ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగనుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతి రోజూ ఉదయం బస చేసిన ప్రాంతంలో స్థానిక సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని, వీటి పరిష్కారానికి అక్కడి నుంచే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తారన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ జనవాణి కార్యక్రమాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. మేధావి వర్గంతో సమావేశాలు ఉంటాయని వివరించారు. వారాహి యాత్రలో భాగంగా వైసీపీ పాలనలో జరుగుతున్న అరాచకాలను, ప్రజలకు జరిగిన నష్టాలను ప్రజలకు పవన్ కళ్యాణ్ తెలియజేస్తారని పేర్కొన్నారు.  జనసేన బ్యానర్ పై పవన్ కళ్యాణ్ హీరోగా వారాహి యాత్ర   సక్సెస్ విషయంలో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే అంచనాలను అందుకుంటుందా లేదా అన్న సందేహాలకు సమాధానంగా  ఇది సినిమా కాదు గురూ ..అంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu