తెలంగాణలో సన్ పెట్రో కెమికల్స్ భారీ పెట్టుబడి.. దావోస్ వేదికగా ఒప్పందం
posted on Jan 23, 2025 11:15AM

దావోస్ లో తెలంగాణ పెట్టుబడుల వేట విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా ఇంధన రంగ దిగ్గజ సంస్థ సన్ పెట్రో కెమికెల్స్ రాష్ట్రంలో 45 వేల 500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చంది. ఈ మేరకు దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఒప్పందం కుదిరింది. ఆ సంస్థ ప్రతినిథులతో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తెలంగాణలో పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. ఇప్పటి వరకు దావోస్ వేదికగా ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే కావడం గమనార్హం. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ఈ ప్రాజెక్టులను సన్ పెట్రో కెమికల్స్ సంస్థ నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టుల సామర్ధ్యం 3 వేల 400 మెగావాట్లు కాగా వీటికి 5440 మెగావాట్ల సామర్ధ్యం ఉండే సోలార్ పవర్ ప్రాజెక్టులను అనుసంధానంొ చేయనున్నట్లు సన్ పెట్రో కెమికల్స్ తెలిపింది.
ఈ ఒప్పందం కుదిరిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చిన సన్ పెట్రో కెమికల్స్ ప్రతినిథులను అభినందించారు. గ్రీన్ ఎనర్జీ లక్ష్య సాధనలో ఈ ఒప్పందాన్ని ఒక మైలు రాయిగా అభివర్ణించారు. భవిష్యత్ ఇంధన అవసరాల దృష్ట్యా గ్రీన్ ఎనర్జీకి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని రేవంత్ ఈ సందర్భంగా చెప్పారు. గ్రీన్ ఎనర్జీలో తెలంగాణను అగ్రగామిగా నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ ఒప్పందం కారణంగా రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాిలు ఏర్పడతాయన్నారు. అలాగే సన్ పెట్రో ప్రాజెక్టుల కారణంగా నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాలు పారిశ్రామికంగా పురోగమిస్తాయన్న రేవంత్ రెడ్డి తెలంగాణ ఏర్పాటు తరువాత ఈ స్థాయిలో భారీ పెట్టుబడులు రావడం ఇదే మొదటి సారి అన్నారు.