గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పదోన్నతులపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి పదోన్నతులపై ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో పదోన్నతుల కల్పనపై  సమగ్ర అధ్యయనం చేపట్టేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని  ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ మొత్తం పది మంది తో   గ్రూప్‌ ఆఫ్‌  మినిస్టర్స్‌  ఏర్పాటుకు   ఉత్తర్వులు జారీ చేశారు.  ఈ కమిటీలో  ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత,  నారాయణ, డీఎస్‌బీ.వి. స్వామి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్,  సత్యకుమార్‌ యాదవ్, గొట్టిపాటి రవికుమార్, సంధ్యారాణి సభ్యులుగా ఉన్నారు.  సచివాలయ సిబ్బంది పదోన్నతుల అంశంపై సమగ్రంగా అధ్యయనం చేయాలని  సబ్‌కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే ఇంటర్‌మీడియేటరీ  పోస్టులను  సృష్టించే అవకాశాన్ని పరిశీలించాలని  సూచించింది.

అలాగే.. అటువంటి పోస్టులు సృష్టించినట్లయితే, వాటికి  అనుగుణంగా పే స్కేల్‌ను నిర్ణయించాలని పేర్కొంది. అదే విధంగా..  ఇతర శాఖల్లో అమలులో ఉన్న ప్రమోషన్‌ ఛానల్‌ వ్యవస్థను కూడా  పరిశీలించి తగిన మార్పులపై సిఫార్సులు చేయాలని ఆదేశించింది. పదోన్నతుల  తర్వాత సచివాలయాల్లో ఏర్పడే ఖాళీల భర్తీ విధానంపై కూడా చర్చించి తగిన  సూచనలు ఇవ్వాలనీ,  ఈ అధ్యయనాన్ని వీలైనంత త్వరగా  పూర్తి చేసి  నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని సబ్‌కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu