ఎయిమ్స్‌లో 13 మంది విద్యార్థులపై చర్యలు
posted on Jul 5, 2025 8:55PM

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో ర్యాగింగ్ కు పాల్పడిన 13 మంది విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్లు ఎయిమ్స్ అధికార ప్రతినిధి డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి చెప్పారు. ఎయిమ్స్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ర్యాగింగ్ కు పాల్పడినవారిని ఆరు నెలల నుంచి ఏడాదిన్నరపాటు సస్పెండ్ చేయడంతోపాటు ఒక్కొక్కరికి రూ.25వేలు జరిమానా కూడా విధించనట్లు తెలిపారు.
ఆ విద్యార్థులను వసతి గృహం నుంచి పూర్తిగా బహిష్కరించినట్లు చెప్పారు. సస్పెన్షన్ కాలం పూర్తి అయిన తర్వాత కూడా వారు హాస్టల్ లో ఉండే అవకాశం లేదన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. ఈ ర్యాగింగ్ పై ఇతరత్రా ఆరోపణలను ఆయన ఖండించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వారి పేర్లు బయటకు చెప్పడం లేదన్నారు.