రేవంత్ వర్సెస్ కిషన్.. అసలు కథ ఇదా ?
posted on Mar 1, 2025 3:23PM

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు. శాశ్వత శత్రువులూ ఉండరు. శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి, ఇది ఎప్పటి నుంచో రాజకీయుల నాలుకలపై నానుతున్న నానుడి. నిజం కూడా. కావాలంటే అందుకు కోకొల్లలుగా ఉదాహరణలు దొరుకుతాయి. ఎవరి దాకానో ఎందుకు, మనం ఇప్పడు మాట్లాడుకుంటున్నతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయమే తీసుకుంటే, ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో గడపలు ఎక్కి దిగారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలలో,ఆయన పాదం మోపని పార్టీ లేదు. బీజేపీతో ప్రత్యక్ష అనుబంధం లేక పోయినా, ఆర్ఎస్ఎస్ అనుబంధంతోనే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది అంతే కాదు.. ఇప్పటికీ ఆయన పాత వాసనలను పూర్తిగా వదులుకోలేదు. ఈ మధ్య కాలంలోనే ఒకటి రెండు సందర్భాలలో ఆయన బహిరంగ వేదిక నుంచి, సాగర్జీ (మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర రావు), బండారు దత్తాత్రేయ ( హిమాచల్ ప్రదేశ్ గవర్నర్) వంటి బీజేపీ పాత తరం నేతలతో పాటు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ వంటి ఈ తరం బీజేపీ నేతలతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
ఇప్పడు, ఆ అనుబంధమే ఆయన కుర్చీకి ఎసరు తెస్తోందా, అంటే, చివరికి ఏమి జరుగుతుందో ఏమో కానీ, పార్టీలోని ఆయన ప్రత్యర్ధులు, ఆయన రాజకీయ మూలాలను అస్త్రంగా చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారని అంటున్నారు. ముఖ్యంగా, కర్ణాటకలో డీకే శివకుమార్ బీజేపీ,సంఘ్ పరివార్ కు దగ్గరవుతున్నారనే అనుమానం’తో ఆయన ప్రత్యర్ధి వర్గం, ఆయన కాషాయం కట్టేస్తారనే ప్రచారం సాగిస్తోంది. ఆ విధంగా, ఆయన్ని పార్టీ నుంచి బయటకు పంపి కొడుకును ప్రమోట్ చేసుకునేందుకు తొందరపడుతున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేతులు కలిపారని అంటున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం, కర్నాటక ఫార్ములాను ఫాలో అవుతున్నట్లుతెలుస్తోంది. అందులో భాగంగా రేవంత్ రెడ్డికి పూర్వాశ్రమంలో సంఘ్ పరివార్ సంస్థలతో ఉన్న సంబంధాలను వెలికి తీసి, దెబ్బ కొట్టే ప్రయత్నాలు సాగిస్తున్నారు.ఈ వ్యూహాన్ని తిప్పి కొట్టేందుకే ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారిగా బీజేపీపై, ముఖ్యంగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలతో విరుచుకు పడుతున్నారని అంటున్నారు.
అయితే రేవంత్ రెడ్డిని అడ్డుకునేందుకు, ఆయన ముఖ్యమంత్రి కాక ముందు నుంచీ పార్టీలోని ప్రత్యర్ధులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. నిజానికి, రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముందు నుంచే పార్టీలో వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు. అప్పటి నుంచే రేవంత్ రెడ్డి కుర్చీకి సెగ తగులుతూ వుంది. అందుకే అప్పట్లో రేవంత్ రెడ్డి సీఎం సీట్లో ఎంత కాలం ఉంటారనే విషయంలో అనేక ఊహాగానాలు వినిపించాయి. నిజానికి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్తల్లోనే రేవంత్ రెడ్డి ఐదేళ్ళు ముఖ్యంత్రిగా ఉంటానని చెప్పే సాహసం చేయలేదు. ఎంతకాలం ఉంటే అంతకాలం ప్రజలకు మేలు చేస్తానని మాత్రమే చెప్పారు. అందరి ఊహాగానాలను తల్లకిందులు చేస్తూ రేవంత్ రెడ్డి, వన్ ఇయర్ మైలు రాయిని దాటేశారు. ఇంకా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు.
కానీ మరో వంక ఆయన్ని కుర్చీ దింపే ప్రయత్నాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇలా కుర్చీకి ముప్పు వచ్చిన ప్రతి సందర్భంలో రేవంత్ రెడ్డి రాజకీయ చతురతతో ప్రత్యర్ధులను చిత్తు చేస్తున్నారు. ఇతర చిన్నా చితకా ప్రయత్నాల విషయం పక్కన పెడితే.. హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి బిగ్ బ్లో ఎదుర్కొన్నారని రాజకీయ వర్గాల్లో అప్పట్లోనే కొంత చర్చ జరిగింది. అప్పట్లో రేవంత్ రెడ్డి ఇరుగు పొరుగు రాష్ట్రాల ముఖ్య నాయకులతో కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో ఉన్న పూర్వాశ్రమ సంబంధాలను ఉపయోగించుకుని బయట పడ్డారని అంటారు.
అవును. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలా నెలల పాటు అటూ ఇటూ ఊగి చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ, బడా కాంట్రాక్టర్ ఒకరు మొదటి నుంచి ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేశారు. సదరు నాయకుడు హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీతో నేరుగా ‘డీల్’ సెట్ చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఇందుకు సంబంధించి ముందుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప్పు అందడంతో జాగ్రత్త పడ్డారు. ఎన్డీఏ ముఖ్య’ నాయకులతో తనకు ఉన్న వ్యక్తిగత పుర్వాశ్రమ సంబంధాలను ఉపయోగించుకుని చక్రం తిప్పారని అప్పట్లో గుసగుసలు వినిపిచాయి. అందుకు తగ్గట్టుగానే ఆ తర్వాత సదరు మాజీ ఎంపీ ఇల్లు వాకిళ్ళు, కార్యాలయాల పై ఏక కాలంలో సీబీఐ, ఈడీ దాడులు నిర్వహించాయి. ఈ దాడులకు సంబంధించి అధికారిక సమాచారం లేక పోయినా, పెద్ద మొత్తంలో సొమ్ములు పట్టుబడ్డట్టు వార్తలొచ్చాయి.దీంతో ఢిల్లీతో కుదుర్చుకున్నడీల్ మెటీరలైజ్ కాలేదని, ఆ విధంగా రేవంత్ రెడ్డికి ఎక్స్టెన్షన్ వచ్చిందని రాజకీయ వర్గాల్లో అప్పట్లో గుసగుసలు వినిపించాయి.
ఇక ఇప్పడు ప్రస్తుతానికి వస్తే ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారిగా బీజేపీపై ముఖ్యంగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శలతో విరుచుకు పడడం వెనక కూడా తన కుర్చీని కాపాడుకునే వ్యూహం ఉందని అంటున్నారు. అయితే, ఈసారి ‘కిస్సా కుర్సీకా’ లో .. ఎవరు గెలుస్తారో?