అస్వస్థతకు గురైన పోసాని.. కడప రిమ్స్ కు తరలింపు
posted on Mar 1, 2025 2:54PM

విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టై ప్రస్తుతం రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్ పోసాని కృష్ణ మురళి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను జైలు నుంచి హుటాహుటిన రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పోసాని కృష్ణ మురళి తెలుగుదేశం అగ్రనేతలు చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 11 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఒక కేసుకు సంబంధించి పోసాని కృష్ణ మురళిని పోలీసులు బుధవారం రాత్రి హైదరాబాద్ లోని మైహోం భూజా అపార్ట్ మెంట లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు.
అక్కడ నుంచి ఓబులాపురం పోలీసు స్టేషన్ కు తరలించి సుదీర్ఘంగా విచారించారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అస్వస్థతకు గురైన పోసానికి రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఈసీజీలో స్వల్ప తేడాలను గుర్తించడంతో పోలీసులు ఆయనను కడప రిమ్స్ కు తరలించారు.