శ్రీశైలంలో సామూహిక వరలక్ష్మి వ్రతంలో 1600 మహిళలు
posted on Aug 8, 2025 6:15PM

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఉత్తర భాగంలోని చంద్రావతి కల్యాణ మండపంలో జరిగిన వరలక్ష్మి వ్రతంలో 1600 పైగా మహిళలు ముత్తైదువులు పాల్గొన్నారు. వరలక్ష్మీ వ్రతం లో పాల్గొన్న మహిళలకు దేవస్థానమే ఉచితంగా వరలక్ష్మి వ్రత పూజా సామగ్రిని అలానే చీర,రవిక వస్త్రం, పూలు, గాజులు, కంకణాలు, వృక్ష ప్రసాదంగా తులసి, ఉసిరి మొక్కలు పుస్తక ప్రసాదంగా శ్రీశైల ప్రభ మాసపత్రిక మూడు రకాల ప్రసాదాలు అందజేయబడ్డాయి. వ్రతాన్ని శాస్త్రోక్తంగా వ్రత సంకల్పాన్ని పఠించి నిర్వీఘ్నంగా జరిపించారు. అనంతరం వ్రతంలో పాల్గొన్న మహిళలకు శ్రీ స్వామి,అమ్మవార్ల దర్శనం కల్పించారు.
వ్రతంలో పాల్గొన్న మహిళలందరికి దేవస్థానం అన్నపూర్ణ భవనంలో భోజన ఏర్పాట్లు కూడా చేసినట్లు ఆలయ ఈవో శ్రీనివాస రావు తెలిపారు. శ్రీశైలంలో చేసే ఏ కార్యక్రమమైనా వేయింతల ఫలితాన్ని ఇస్తుందని పురాణాల్లో చదివానని ఈవో పేర్కొన్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీశైలంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతంలో ఆయన సతీసమేతంగా పాల్గొన్నారు. జ్యోతిర్లింగం,శక్తిపీఠం కలిసిన పవిత్రమైన క్షేత్రంలో వ్రతం నిర్వహించుకునేవారు ఎంతో అదృష్టవంతులని తెలిపారు. ఈ వ్రతంలో ఆలయ ఈవో దంపతులు తోపాటు, దేవస్థానం మహిళ అధికారులు పాల్గొన్నారు.