తెలంగాణ జాగృతి.. కవిత వ్యతిరేక ఆకృతి!?
posted on Sep 5, 2025 9:16AM

ఇప్పటి వరకూ కవితకు బీఆర్ఎస్ లోనే వ్యతిరేకత ఉందని అంతా భావించారు. ప్రస్తుతం ప్రస్తుతం ఆమె అధ్యక్షత వహిస్తోన్న తెలంగాణ జాగృతిని పూర్తి స్థాయి పార్టీ చేస్తారన్న వార్తలు వెల్లువెత్తాయి. అయితే ఈ విషయంలో కవిత చేసిన కామెంట్ ఏంటంటే తన భవితవ్యానికి వచ్చిన తొందరేం లేదని. అంతే కాదు తాను 27 ఏళ్ల వయసులో చిన్న బిడ్డను తీసుకుని ఇక్కడికి వచ్చాననీ.. ఆనాటి నుంచి ఈ నాటి వరకూ తన జీవితం రోడ్డు మీదే ఉందని అన్నారామె. విచిత్రమైన విషయమేంటంటే.. ఇప్పుడు తెలంగాణ జాగృతి నేతలు సైతం ఇదే తరహా కామెంట్ చేశారు. మేడం మీరే కాదు మీరు తీసుకున్న నిర్ణయాల కారణంగా తాము కూడా మళ్లీ రోడ్డు మీద పడ్డట్టయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు జాగృతి ఫౌండర్, ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్ సాగర్. దీంతో కవితకు భారీ షాక్ తగినట్లైంది.
బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా సమయంలో ఆ సంస్థ ఫౌండర్ గా పేరున్న రాజీవ్ సైతం రివర్స్ కావడంతో.. కవిత భవిత అడకత్తెరలో పోకచెక్కలా మారినట్టు భావిస్తున్నారంతా. ఇప్పటి వరకూ ఆమె వెనక ఉన్నది జాగృతి ఒక్కటే అనుకుంటే.. ఇప్పుడా జాగృతిలోనూ చీలిక రావడంతో.. ఆమె వెనక ఈ సంస్థ కూడా పూర్తిగా లేదన్న విషయం తేట తెల్లమైంది. ఇప్పటికే ఆమె తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లోంచి బీఆర్ఎస్ పార్టీ గుర్తును తొలగించారు. తాను మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ అన్న సవరణలు చేశారు. కేవలం కేసీఆర్ బొమ్మ మాత్రమే ఉంచారు.
ఇప్పటి వరకూ ఎన్టీఆర్, వైయస్ వంటి వారు మరణించాక మాత్రమే వారిని భిన్న వర్గాల వారు ఓన్ చేసుకున్నారు. దాదాపు దేశంలో తొలిసారిగా.. తన తండ్రి ద్వారా సస్పెన్షన్ వేటు ఎదుర్కున్న కవిత.. ఆయన బొమ్మను ఇంకా తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో ఉంచుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. మరి చూడాలి కవిత భవితేంటో.