రైతుల కష్టాలు తెలిసిన పాలకులెక్కడ!  అన్నదాత  వెతలు తీరేదెన్నడు?  

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై దేశమంతా చర్చిస్తోంది. కొత్త చట్టాలు కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసేలా ఉన్నాయని ఆరోపిస్తున్న రైతులు దేశ రాజధానిపై  దండెత్తారు. ఢిల్లీలోకి అనుమతించకపోవడంతో సరిహద్దుల్లోనే ఆందోళన చేస్తున్నారు. నాలుగు వారాలుగా అక్కడే ఉన్నారు అన్నదాతలు. కేంద్రం బిల్లులపై వెనక్కి తగ్గే వరకు కదిలేది లేదని కర్షకులు ఖరాకండిగా చెప్పేస్తున్నారు. మోడీ సర్కార్ మాత్రం కొత్త సాగు చట్టాలు చరిత్రాత్మకం అంటోంది. 21వ శతాబ్దపు భారతదేశ అవసరమని, అన్నదాతల  ఆర్థిక స్థితి గతులను మార్చివేస్తుందని బీజేపీ నేతలు గొప్పగా చెబుతున్నారు. అయితే అసలు రైతుల అసలు సమస్యలేంటీ.. అన్నదాతలు ఏం కోరుకుంటున్నారు... రైతు రాజు ఎలా అవుతారు.. వ్యవసాయాన్ని పండగ చేయాలంటే ఏం చేయాలి.. అన్న అంశాలు మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు. రాజకీయ కోణంలోనే అధికార, విపక్షాలు ప్రకటనలు చేస్తూ ప్రధాన సమస్యను పక్కదారి పట్టిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం సమస్యను మరింత జటిలం చేయాలనే చూస్తున్నారు కాని.. అన్నదాతల కోసం ఏం చేయాలన్న దానిపై దృష్టి సారించడం లేదు మన ఘనాపాటి నేతలు. 

గత ప్రభుత్వాలు తెచ్చిన చట్టాల్లో గాని.. ఇప్పుడొచ్చిన కొత్త బిల్లుల్లో కాని రైతుల కన్నీటి కష్టాల గురించి ఆలోచించిన దాఖలాలేవి కనిపించడం లేదు. ఆధునిక పద్దతులంటూ, గ్లోబలైజేషన్ పేరుతో కొత్త చట్టాలను తెరపైకి తెస్తున్నారు. గ్రామీణ రైతులకు సాంకేతిక  పరిజ్ఞానం ఉందా లేదా అన్న అలోచన చేయకుండానే... ఆన్ లైన్ మార్కెట్ అంటూ ఊదరగొడుతున్నారు. ఎప్పటికప్పుడు పండించిన పంటను అమ్ముకుని..  ఆ కాలానికి జీవితం గడిపే సామాన్య రైతులకు.. ఈ టెక్నాలజీలు, ఆన్ లైన్ మార్కెట్లు ఎలా ఉపయోగపడతాయన్న కనీస ఆలోచన కూడా చేయడం లేదు చట్టాలు తయారు చేసే మన సివిల్ సర్వెంట్లు. ఏసీ రూముల్లో కూర్చుని బిల్లులు రూపొందించే  ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లకు క్షేత్రస్థాయిలో  రైతులకు ఉండే బాధలు, వెతలు, అవసరాలు ఎలా తెలుస్తాయన్న ప్రశ్న సామాజిక వేత్తలు, సామాన్య జనాల నుంచి వస్తోంది. పల్లెల్లో పర్యటించి, వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి, పొలాల్లో తిరిగి..  కష్టపడి పంటలు పండిస్తున్న కర్షకులను కలిసి మాట్లాడితేనే అసలు సమస్యేంటో తెలుస్తుందని చెబుతున్నారు. రైతుల జీవితాలను బాగు చేయాలంటే ఏం చేయాలే వారికి అవగాహన వస్తుందంటున్నారు. 

నిజానికి రైతులు కోరుతున్నవి గొంతెమ్మ కోరికలేం కాదు. వాళ్లు అడుగుతున్నదల్లా.. పంటకు ముందు పెట్టుబడి సాయం. పంట చేతికివచ్చాకా దానికి గిట్టుబాటు ధర. ఈ రెండు కల్పిస్తే చాలు తమకు ప్రభుత్వాలు కొత్తగా చేయాల్సిందేమి లేదని చెబుతున్నారు. ఈ రెండు సమకూర్చడం ప్రభుత్వాల కనీస బాధ్యత కూడా.  కాని వీటిని ఏనాడు పట్టించుకోలేదు పాలకులు. మన దేశంలో ఉన్న రైతుల్లో దాదాపు 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. ఏ కాలానికి ఆ కాలం పంటలు సాగు చేసి అమ్ముకుని కాలం వెళ్లదీసేవారే. వ్యవసాయ రైతుకు మొదటి నుంచే కష్టాలుంటాయి. విత్తనాల కోసం అప్పు తేవాల్సిందే. ఎరువుల కోసం .. కూలలకు ఇవ్వడానికి రుణమే గతి. ఇంత చేసి...ఎంతో కష్టపడి పంట పండిస్తే.. అక్కడ గిట్టుబాట ధర రాదు. అప్పటివరకు మంచిగానే ఉండే పంట రేటు.. రైతు పంట చేతికొచ్చే సమయానికి టపీమని పడిపోతుంది. కాదు కాదు  దళారులు, కమీషన్ ఏజెంట్లు కుమ్మక్కై అలా పతనం చేస్తారు. దీంతో చేసిన అప్పులు తీర్చడం కోసం వాళ్లిచ్చిన రేటుకే పంటను అమ్మేస్తుంటారు రైతులు. పంట వ్యాపారుల దగ్గరకు రాగానే మళ్లీ రేట్లు కొండెక్కుతాయి. తాము ఉత్పత్తి చేసే  ఏ వస్తువుకైనా ఉత్పత్తి దారుడే రేటు నిర్ణయిస్తారు. ఒక్క రైతుకు మాత్రమే ఆ అవకాశం లేదు. కష్టపడి రైతు పంట పండిస్తే.. దాని ధర మాత్రం దళారీ నిర్ణయిస్తాడు. రైతులకు ఏనాడు గిట్టుబాట ధర రాదు. కాని రైతు పండించిన ఆ పంటకు మాత్రం మార్కెట్ లో రేటు భారీగా ఉంటుంది. మాల్స్ లో అయితే మరీ ప్రియం. ఇలాంటి దుర్భర వ్యవస్థను బాగు చేయకుండా.. ఇలాంటి  కొత్త చట్టాలతో రైతులకు ప్రయోజనం ఏంటన్నది పాలకులకే తెలియాలి. 
 
 రైతులకు గిట్టుబాట ధరే పెద్ద సమస్యగా ఉంటే.. ప్రకృతి కూడా వాళ్లపైనే ప్రతాపం చూపిస్తుంది. కరువొచ్చినా మొదటగా కుదేలయ్యేది అన్నదాతే.  కుండపోతగా వర్షం కురిసినా నిండా మునిగేదే కర్షకుడే. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి మాత్రం ఏ చట్టాలు ఉపయోగపడవు. విపత్తుల సమయంలో ఏం చేసి అన్నదాతలను నిలబెట్టగలమన్న ఆలోచనే చేయరు పాలకులు. రైతులకు కావాల్సిన కనీస చర్యలు తీసుకోరు కాని.. ఎన్నికలు వచ్చాయంటే చాలు రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తాం, జీవన ప్రమాణాలు మార్చేస్తామని గొప్ప గొప్ప ప్రకటనలు చేస్తుంటారు. దేశానికి తిండి పెట్టే అన్నదాతలను బిక్షగాళ్లుగా మారుస్తున్నారు పాలకులు. అది చేస్తాం ఇది చేస్తామంటూ వారిని ఆశల పల్లకీలో ఊరేగిస్తూ.. చివరికి అప్పుల పాలు చేసి... వాళ్లను ఆత్మహత్యలకు పురికొల్పుతున్నారు. రాజకీయ నేతల వైఫల్యాలు, కుట్రల వల్లే దశాబ్దాలు గడుతున్నా అన్నదాతల జీవితాలు మారడం లేదని మేధావులు, వ్యవసాయ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

రైతులు తమ సరుకును దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని కొత్త బిల్లులలో చెప్పారు. కాని  రైతులు తమకున్న కొద్దిపాటి సరుకును ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరేచోటుకు తీసుకెళ్లి అమ్ముకోవడం సాధ్యమేనా?  అని ప్రశ్న వస్తోంది. ఇది వ్యాపారులు ఎక్కడికైనా వెళ్ళి సరుకును కొనుగోలు చేయడానికి ఉపయోగపడే విధానమంటున్నారు. కార్పొరేట్‌ గద్దలు దేశమంతా విస్తరించడానికి, ప్రైవేటు వ్యాపారులకు తలుపులు బార్లా తెరువడానికి ఉపయోగపడేలా  బిల్లు ఉందంటున్నారు వ్యవసాయ నిపుణులు.  కార్పొరేట్, బహుళ జాతి కంపెనీలు.. వాటి ఏజెంట్లు రైతుల నుంచి కొనుగోలు చేసి ఆ తరువాత రాష్ట్రాలు దాటిస్తూ వ్యాపారం చేసుకుంటాయని చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కనీస మద్దతు ధరలు లేవి..  కేంద్రం, కొన్ని రాష్ట్రాలు కనీస మద్దతు ధరలు ప్రకటించినా వాటికి చట్టబద్ధత లేదు. అవన్ని ప్రకటనలకే పరిమితమవుతున్నాయి తప్ప రైతులకు ఆ ధర దక్కడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.  నిజంగా రైతులకు లాభం చేకూర్చాలనే ఉద్దేశమే కనుక ఉంటే మార్కెటింగ్ సదుపాయాలు పెంచి, ప్రభుత్వమే అన్ని పంటలను సరైన మద్దతు ధరకు కొనుగోలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.  

 కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాల్లో ఉన్న ఆహార ఉత్పత్తులపై నియంత్రణ ఎత్తివేయడం చాలా ప్రమాదకరమంటున్నారు. సాధారణంగా పంటలు కోతకు వచ్చే సమయంలో ధరలు తక్కువగా ఉంటాయి. ఆ సమయంలో వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేసి భద్రపరచుకుంటారు. ఆ తర్వాత ధరలను పెరిగిన తర్వాత అమ్ముకుంటారు. ఎప్పుడు ఎక్కువ రేట్లు ఉంటే అప్పుడు అమ్ముకోవడం వలన మిగిలిన సమయంలో ఆహార కొరత ఏర్పడే ప్రమాదముందన్న అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇక పంట వేయడానికి ముందే రైతు, కొనుగోలుదారు ఒప్పందం కుదుర్చుకునే వీలు కల్పిస్తుందీ కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం. అయితే సంస్థలతో చేసుకునే ఒప్పందాల్లో ఏముందో రైతులు ఎంతవరకు అవగాహన చేసుకుంటారన్నది ప్రశ్నార్దకమే.  ఈ ఒప్పందాలు నేరుగా రైతు, సంస్థ మధ్య జరుగుతాయి. మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, మార్కెట్ కమిటీలు కానీ ఏమీ ఉండవు. దీంతో రైతు మోసపోవడానికి అవకాశాలు ఎక్కువ. ఇక ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పేరుతో పాన్ కార్డ్ ఉన్న ఎవరైనా ఈ-వర్తకం చేసుకోవచ్చన్నది వినడానికి బాగానే ఉన్నా.. ఎంత శాతం మంది రైతులకు అలాంటి సాంకేతిక అవగాహన ఉంటుందన్న ప్రశ్న వినిపిస్తుంది. దీనికంటే ఇప్పటికే ఉన్న ఈ-నామ్ వ్యవస్థను మెరుగుపరిచి రైతులకు మేలు కలిగేలా చేయాలని సూచిస్తున్నారు. 

 ఇప్పటికైనా ప్రభుత్వాలు, పార్టీలు మేల్కొని, రాజకీయ ప్రయోజనాల కోణంలో కాకుండా నిజంగా అన్నదాతలు ఏం చేస్తే బాగుపడతారే అలోచించి.. ఆ దిశగా చట్టాలు చేస్తే మంచిది.. ఆ దిశగా పాలకులు అడుగులు వేయాలని మనం కోరుకుందాం... జై కిసాన్..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu