కాంగ్రెస్ అధ్యక్ష పదవికి  సోనియా గుడ్ బై...?

నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎట్టకేలకు పెదవి విప్పారు.ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణయ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆమె మనసు విప్పి మాట్లాడారు. ఈవీఎంల మీదనో. లేక మరెవరి మీదనో ఓటమి నెపాన్నినెట్టి  చేతులు దులిపేసుకోవడం కాకుండా, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  ఘోర పరాజయం పై ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. ఈ ఓటమిని తేలిగ్గా తీసుకోలేమని,తీసుకోరాదని కొంచెం చాలా గట్టిగానే బాధను వ్యక్తపరిచారు.  

అలాగే, ఈ ఓటమి నుంచి గుణ పాఠాలు నేర్చుకోవాలనీ అన్నారు. అలాగే, షరా మాములుగా, ఓటమి కారణాల విశ్లేషణకు ఓ చిన్న కమిటీ ఏర్పాటు చేస్తామని,ఆ కమిటీ అట్టే సమయం తీసుకోకుండా నివేదిక తయారు చేస్తుందని, సోనియా చెప్పారు. అంటే, వరసగా రెండు సార్లు లోక్’సభ ఎన్నికల్లో రుచి చూసిన మహా ఓటమి కంటే, అలాగే, యూపీ, బీహార్, గుజరాత్ వంటి కీలక రాష్ట్రాలు సహా అనేక రాష్ట్రాల శాసన సభ ఎన్నికలలో ఎదురైన వరస ఓటముల కన్నా,ఈ తాజా ఎన్నికల ఓటమి భయంకరమైనదా, ఈ ఓటమి విషయంలోనే సోనియాగాంధీ ఇంతలా ఎందుకు స్పందించారు? నిజానికి గతంలో ఎదురైనా ఓటములతో పోలిస్తే, ఇదేమంత అనూహ్య ఓటమి, అసలే మింగుడుపడని ఓటమి కాదు. అయినా, ఆమె ఇంతలా దిగివచ్చి ఆత్మ పరిశీలన, ఇంటిని చక్కదిద్దుకోవడం వంటి వ్యాఖ్యలు ఎందుకు చేసినట్లు? ఇవి రాజకీయ వర్గాల్లో, వినవస్తున్నప్రశ్నలు. 

నిజానికి, 2014. 2019 సార్వత్రిక  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ‘చారిత్రక ఓటమి’ని సొంత చేసుకుంది. 2014లో  పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కేవలం 44 సీట్లకుపరిమితం అయింది. కనీసం ప్రతిపక్ష హోదాను కూడా పొందలేక పోయింది. అలాగే, 2019 లోనూ లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం రెండంకెల సంఖ్యను దాటలేదు. ఈ రెండు సందర్భాలలోనూ కాంగ్రెస్ పార్టీ కనీసం ఓ ఐదారు రాష్ట్రాలలో బోణీ అయినా కొట్టలేదు, ఒక్క సీటులోనూ గెలవలేదు. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే, ఒకప్పుడు దేశంలో అత్యధిక రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వరసగా ఒక్కొక్క రాష్ట్రంలో అధికారాన్ని చేజార్చుకుంటూ వచ్చి, ప్రస్తుతం మూడు రాష్ట్రాలకే కాంగ్రెస్ అధికారం పరిమితం అయింది. 

ఇవ్వన్నీ కూడా బాధించే ఓటములే, అయినా, ఆ అన్నిటికంటే, ప్రస్తుత ఓటమి మాత్రమే మహా ఓటమిగా కాంగ్రెస్ అధినాయకురాలు ఎందుకు భావిస్తున్నారు? ఇది ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. ఇంతవరకు అంతో ఇంతో మిగిలిన ఆశలు కూడా ఈ ఓటమితో అవిరై పోయాయా? అలాగే, రాహుల గాంధీ సామర్ధ్యం మీద ఉన్న ఆశలు సైతం.. అడుగంటి పొయాయా?రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్న కోరిక విషయంలోనూ, ఆమె అది అయ్యేది కాదన్న నిర్ణయానికి వచ్చారా? అందుకే సోనియా చేతులు ఎత్తేశారా? అంటే, పార్టీఅంతరంగికులు అవుననే అంటున్నారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకులు (గ్రూప్ అఫ్ 23) పార్టీలో సమూల మార్పులు అవసరమని, ఇంచు మించుగా రెండు సంవత్సరాల క్రితం ఆమెకు రాసిన లేఖ ప్రభావంతోనే ఆమె, పార్టీ పగ్గాలు వదిలే ‘అంతిమ’  నిర్ణయం తీసుకున్నారా? అంటే అందుకు కూడా ఇటు పార్టీ వర్గాలు, అటు రాజకీయ విశ్లేషకులు కూడా అవుననే సమాధానం ఇస్తున్నారు. ఈ ఎన్నికల ఓటమితో సోనియా గాంధీలో కాంగ్రెస్ పార్టీ మనుగడ పట్ల, పార్టీ పై కుటుంబ పెత్తనం కొనసాగింపు విషయంలోనూ మిగిలిన ఆశలు అడుగంటి పోయాయని అందుకే,ఆమె కాడి వదిలేసేందుకు సిద్దమయ్యారని రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. 

అదే విధంగా మమతా బెనర్జీ లేదా చంద్రబాబు నాయుడు వంటి మరో బలమైన ప్రాంతీయ పార్టీ జాతీయ నాయకుని సారధ్యంలో,  బీజేపీని సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు ప్రత్యాన్మాయ ఫ్రంట్ ఏర్పాటుకు జరుగతున్న ప్రయత్నాలకు కాంగ్రెస్ అవరోధం కారాదన్న ఉద్దేశంతో కూడా, సోనియా గాంధీ వాస్తవ అవగాహనకు వచ్చారని, పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఒక విధంగా కాంగ్రెస్ పార్టీపై గాంధీ నెహ్రూ కుటుంబం ఆధిపత్యాన్ని ‘త్యాగం’ చేసేందుకు ఆమె సిద్ధమయ్యారని అందుకే ఆత్మ పరిశీలన అవసరాన్ని నొక్కి చెప్పారని అంటున్నారు. 

అదలా ఉంటే, సోనియా గాంధీ తమ ప్రసంగంలో మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు. మిగిలిన విషయాలను పక్కన పెట్టి ముందుగా ‘మన ఇంటిని మనం చక్క దిద్దుకుందాం’ అని అన్నారు. సోనియా గాంధీ చేసిన, ‘ఇంటిని చక్క దిద్దుకుందామనే వ్యాఖ్యపై ఇప్పుడు పార్టీ వర్గాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. నిజనికి పార్టీ సీనియర్ నాయకులు రాసిన లేఖలో కోరింది కూడా ఇదే.. అయిన దానికి కానీ దానికి మోడీని, బీజేపీని విమర్శించడం వలన ప్రయోజనం లేదని , ముందుగా ఇంటిని చక్కదిద్దుకుందామనే సీనియర్ నేతలు కోరారు. ఇప్పుడు సోనియా గాంధీ కూడా అదే మాట అన్నారంటే ,ఆమె కూడా సీనియర్ నేతల ఆలోచనలతో ఎకీభవిస్తున్నట్లే అనుకోవచ్చును.  
నిజమే, ఇటీవల  జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ, ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది.చివరకు ప్రణబ్ దాదా వంటి ఉద్దండ నేతలను ఇచ్చిన పశ్చిమ బెంగాల్లో పార్టీ అసలు ఖాతానే తెరవలేదు. వామ పక్షాలతో పొత్తు పెట్టుకున్నా, పోటీ చేసిన స్థానాల్లో  మూడొంతులకు పైగా స్థానాల్లో పార్టీ అభ్యర్ధులు డిపాజిట్స్ కూడా కోల్పోయారు. కేరళ, అస్సాం రాష్త్రాలలో ఆశించిన విధంగా హస్తం పార్టీ అధికారం సాధించేలేక పోయింది. పుదుచ్చేరీలో ఉన్న అధికారం కోల్పోయింది. ఒక తమిళనాడులో మాత్రం, అది కూడా, డిఎంకేతో పొత్తు పుణ్యాన పరువు నిలుపుకుంది. కొద్దిగా మెరుగైన ఫలితాలు సాధించింది. ఈ నేపధ్యంలోనే సోనియా గాంధీ, బీజేపీ వ్యతిరేక శక్తుల సారధ్య బాధ్యతల నుంచి  తప్పుకోవడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీ, ఫ్యామిలీ  కూడా అడ్డుగా నిలవరాదనే ఉద్దేశంతోనే, ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. 

అయితే, సోనియా గాంధీ నిజంగా, పార్టీ పగ్గాలు వదులు కునేందుకు సిద్డమయ్యారా లేక మనసులో మరేదో ఉంచుకుని, పార్టీ నాయకత్వం పై మరో మారు విరుచుకు పడేందుకు సిద్దమవుతున్న సీనియర్లను ప్రస్తుతానికి శాంతింపప చేసేందుకు చేదు గుళికలకు షుగర్ కోట్ అద్దారా,అనేది ముందుగా అనుకున్న విధంగా జూన్,జులైలలో కాంగ్రెస్ నూతన అధ్యక్షుని ఎన్నిక   జరిగితే, గానీ, తెలియదు.అయినా, కాంగ్రెస్ పార్టీ పునర్జీవనం సాధ్యమా అంటే, అవుననే సాహసం ఎవరూ చేయడం లేదు. బీజేపే ఒడి పోవచ్చు, అధికారం కోల్పోవచ్చును, కానీ, కాంగ్రెస్ పార్టీకో పూర్వవైభవ స్థితి మాత్రం తిరిగిరాదు, అనే విశ్లేషకులు గట్టిగా అభిప్రాయ పడుతున్నారు.