గోదావరిలో వృథాగా కలిసిపోతున్న జలాలను వాడుకుంటామంటే నష్టమేంటి? : సోమిరెడ్డి

 

బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్పందించారు. ఏటా 2500 నుంచి 3000 టీఎంసీల గోదావరి జలాలు వరదల రూపంలో వృధాంగా సముద్రంలో కలిసిపోతుండగా, కేవలం 200 టీఎంసీలను బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఉపయోగించుకోవాలన్న ఏపీ ప్రతిపాదనపై తెలంగాణ నాయకులు ద్వేషభావంతో వ్యవహరించడం బాధాకరమని  సోమిరెడ్డి అన్నారు.

ఏపీ మంత్రి నారా లోకేశ్ ఏం తప్పు మాట్లాడారని మాజీ మంత్రి హరీశ్ రావు అక్కసు వెళ్లగక్కుతున్నారు?" అని సోమిరెడ్డి ప్రశ్నించారు. గోదావరి నీటి వాటాలపై స్పష్టత ఉందని, 1540 టీఎంసీల నికర జలాల్లో ఏపీకి 572 టీఎంసీలు, తెలంగాణకు 968 టీఎంసీలు కేటాయించగా, ఇప్పటివరకు రెండు రాష్ట్రాలు కలిపి 800 టీఎంసీలను కూడా వినియోగించలేకపోతున్నాయని ఆయన గుర్తు చేశారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమ, నెల్లూరు, పల్నాడు ప్రాంతాల్లో 7.42 లక్షల ఎకరాలకు సాగునీరు, 2.58 లక్షల ఎకరాలకు స్థిరీకరణ, 80 లక్షల మందికి తాగునీరు, పరిశ్రమలకు 20 టీఎంసీల నీటిని అందించాలన్నది ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని సోమిరెడ్డి వివరించారు. 

"గోదావరి జలాలతో రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను మరిచిపోవద్దు. ఒక్క చుక్క నీరు ఇవ్వమని హరీశ్ రావు చెప్పడం బాధాకరం" అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద 450 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారని, అయినా ఏపీ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని, అలాగే తెలంగాణలో ఇతర ప్రాజెక్టులపైనా వ్యతిరేకత వ్యక్తం చేయలేదని సోమిరెడ్డి పేర్కొన్నారు. "తెలుగు ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. ఏపీ ప్రజలను పాకిస్తాన్ ఉగ్రవాదులుగా చూడవద్దు. రాష్ట్రం విడిపోయినా మన మధ్య బేధాలెందుకు?" అని తెలంగాణ నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu