సాఫ్ట్ వేర్ వ్యవసాయం

కరోనాకి ముందు లాక్ డౌన్ అంటే ప్రపంచానికి పెద్దగా తెలీదు. దీని కారణంగా ఎంతోమంది ఉపాధిని కోల్పోయారు. ఆర్ధికంగా చితికిపోయారు. అయితే సాఫ్ట్ వేర్ రంగంలో పని చేస్తున్నవాళ్లపై కరోనా లాక్ డౌన్ ప్రభావం తక్కువనే చెప్పాలి. కారణం ఇంటి వద్దనుంచే పని చేసే వెసులుబాటు ఉండటం. అయితే  పని విధానం కొత్తగా ఉండటం. ఎప్పటికప్పుడు టీం సభ్యులతో ఫోన్ లో అందుబాటులో ఉండి చర్చల్లో పాల్గొనడం ఇలా కంపెనీ లో వెచ్చించే సమయంకన్నా వర్క్ ఫ్రం హోమ్ లో ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. దీనివలన ఎంతోమంది సాఫ్ట్ వేర్ యువత ఒత్తిడికి లోనై మానసిక సమస్యలకు గురవుతున్నారు. దీనిని అదిగమించేందుకు కొంతమంది ధూమపానం, మద్యపానం లాంటి వ్యసనాలకు దగ్గరవుతున్నారు అనేది కాదనలేని వాస్తవం.

ప్రకాశం జిల్లా,కనిగిరి ప్రాంతం గార్లపేట గ్రామానికి చెందిన రాంబాబు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. లాక్ డౌన్ కారణంగా తను కూడాఇంటికి వచ్చేసాడు. అందరిలాగే పని ఒత్తిడి వలన ఇతను కూడా మొదట్లో కొంత ఇబ్బంది పడ్డాడు. అయితే దానిని అదిగమించేందుకు రొటీన్ కి భిన్నంగా  స్మార్ట్ వ్యవసాయాన్ని ఎంచుకున్నాడు. ఇంటి ఆవరణలోనే కూరగాయలు పండించాలి అనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవు విషయం తల్లిదండ్రులకు చెప్పాడు. కొంత వారి సహాయం కూడా తీసుకొని ఇంటి ఆవరణలోని మట్టిని తవ్వి  పరిసర ప్రాంతంలోనే ఎరువు తో మిశ్రమం అయిన మట్టిని తెప్పించి సత్తువ కలిగిన నేలను తయారు చేసాడు. నాణ్యమైన విత్తనాలు తెప్పించి నాటి చిన్న కూరగాయల తోటని సృష్టి చేసి స్నేహితులకు మిగతా గ్రామంలో యువతకు ఆదర్శంగా నిలబడ్డాడు రాంబాబు. ఇప్పుడు తనకే కాదు చుట్టుపక్కల వాళ్లకి కూడా తను పండించిన కూరగాయలను అందిస్తూ అందరి మన్ననలను అందుకుంటున్నాడు. 

కుటుంబానిది వ్యవసాయ నేపధ్యమే అయినా వాణిజ్యపంటలే గానీ కూరగాయలు పండేవి కాదు. ప్రతి రెండు మూడు రోజులకు ఇంటికి కూరగాయలు అవసరమయ్యేవి. అవి అతనే మార్కెట్ కి వెళ్లి కొనుగోలు చేసుకొని వచ్చేవాడు. ఇలా రెండు నెలలు గడిచాక పని ఒత్తిడి, మరోవైపు తరచూ మార్కెట్ కి వెళ్లి ఇవి కొనుగోలు చేసుకురావడం చికాకుగా అనిపించింది. ఆ సమయంలో ఇంటి ఆవరణలోనే కూరగాయలు పండిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది. అలా తన స్మార్ట్ వ్యవసాయ ప్రయాణం మొదలైందని చెప్పుకొచ్చారు. ఈ పని వలన నిరంతరం ల్యాప్ టాప్ ముందు కూర్చొని ఉండే నాకు ఈ తోట పెంపకం మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని సంతృప్తిని ఇస్తుంది అన్నారు.

రెండు అంకెల జీతం రాగానే పాశ్చాత్య పోకడలకు పోయి, అర్థంలేని వ్యాపకాల ప్రభావంతో వ్యసనాలకు అలవాటు పడి మన మూలలను మరిచిపోతున్న కొంతమంది యువతకు రాంబాబు ప్రయాణం ఆదర్శనీయం. ఆచరణీయం. మీరు కూడా కొత్తగా ఒకటి ప్రయత్నించండి.

"ప్రతి ఆలోచనా ఒక అగ్నికణం. దానిని సన్మార్గంలో రగిలించి వెలిగించావంటే నీతోపాటు చుట్టూ సమాజాన్ని కూడా వెలిగిస్తుంది."

◆వెంకటేష్ పువ్వాడ