ఎదుటి వాళ్ల స్టార్ మాన చేతుల్లో...

ఉరుకులు పరుగుల జీవితంలో క్షణం తీరిక లేకుండా ఉంటాము. ఎందుకంటే బ్రతుకు అనేది పెద్ద పోరాటం. ఆగితే కుదరదు. ఈ కరోనా పుణ్యమా అని బ్రతకడం ఒక యుద్ధం అయింది. ముఖ్యంగా యువత పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రైవేట్ స్కూళ్లు ఆన్లైన్ క్లాస్ ల తో వారి ఆదాయాన్ని రెట్టింపు చేసుకున్నాయి గానీ స్వార్థంతో అదనపు ఉద్యోగస్తులకు తొలిగించి ప్రైవేట్ టీచర్స్ ని రోడ్డున పడేసారు. ఇదేంటని అడిగే వ్యవస్థలు లేవు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో బ్రతుకునీడ్చడానికి ఎంతోమంది పట్టాదారులు, కొలువు పోయిన ప్రయివేటు టీచర్లు ఇంకా చాలామంది వివిధ అత్యవసర సేవా రంగాల్లో తక్కువ జీతాలకే ఉద్యోగాలు చేస్తున్నారు. ఓలా, ఉబర్, స్విగ్గీ, జామోటో, ఇంకా కొరియర్ సంబంధిత బడా సంస్థలు వాటి మాతృకతో వెలసిన ఇంకొన్ని సంస్థలు శ్రమను దోచుకుంటున్నాయి గానీ తగిన ప్రతిఫలం ఇవ్వడం లేదు.

క్లిష్ట సమయాల్లో  ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా మనకి సేవలు అందించే మన యువతకి చేతనైన సహాయం చేయాలి . వెంటనే "మనం ఏమి చేయగలం "
అనే ప్రశ్న అందరికీ కలుగుతుంది. అది ఎలాగో చెప్తాను.

వారికి రేటింగ్ ఇవ్వడం ద్వారా ఎంతోకొంత మనం వారికి సపోర్ట్ గా నిలిచినవాళ్ళం అవుతాము. మనం ఇచ్చే స్టార్స్ మరియు కామెంట్స్ ద్వారా వారి జీతం వృద్ధి చెందుతుంది. ఇలా మనం ఇచ్చే రేటింగ్స్ ద్వారా వారియొక్క నిబద్ధతని గౌరవించినట్లు అవుతుంది. ఇది చాలా చిన్న విషయం. చాలామంది స్కిప్ చేయడం చూసాను. అందుకే ప్రత్యేకంగా చెప్తున్నాను. అయితే కొంతమంది పరిపక్వత లేకుండా ఐదునిమిషాలు లేట్ అయిందనో లేక తెచ్చిన ఆర్డర్ మారిపోయిందనో ఇలా రకరకాల కారణాలతో మన అహం చల్లార్చుకోవడానికి వారిని కోపగించుకుంటాము. ఒక అయిదు నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా ఆలోచిస్తే "అయ్యో తొందరపడి కోప్పడ్డాము" అని పశ్చాత్తాప పడతాము. అందుకే అలాంటివారితో ప్రేమగా రెండు మాటలు మాట్లాడండి. స్వచ్ఛమైన ఒక చిరునవ్వుతో మిమ్మల్ని పరిచయం చేసుకుంటే అది అవతలవాళ్లకి ఎంతో స్వాంతన గా ఉంటుంది. నిరుత్సాహం దూరమై కొత్త ఉత్సాహం వారిలోకి వస్తుంది.

◆ముగింపు

రేటింగ్ ఇవ్వడం మర్చిపోకండి. మీరిచ్చే రేటింగ్ వెనుక ఒక కుటుంబం ఆధారపడివుంటుంది అనేది అర్ధమయుంటుంది. ఇలా రుపాయి ఖర్చు లేకుండా అవతలివాళ్ళకి మనం చేయగలిగే సహాయలు చాలా ఉన్నాయి. ఇలాంటి విషయంలో క్షణం ఆలోచించకుండా సహాయపడండి. అది అవతలవాళ్లకి ఎంతో ఉపయోగపడుతుంది.

◆ వెంకటేష్ పువ్వాడ