ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం.. కార్మికుల ప్రాణాలు గాలిలో దిపమేనా?
posted on Feb 25, 2025 9:50AM

శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచి కెనాల్ (ఎస్ఎల్బీసీ) సోరంగంలో చిక్కుకున్న ఎనమండుగురు కార్మికుల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. వారి ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. ఈ ప్రమాదం నుంచి 40 మంది వరకూ క్షేమంగా బయటపడ్డారు.ఎనిమిది మంది సొరంగంలో చిక్కుకుని మూడు రోజులు అవుతున్నా.. వారికి క్షేమంగా రక్షించేందుకు సాగుతున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం లేదు. గంటలు గడుస్తున్న కొద్దీ వారిని ప్రాణాలతో బయటకు తీసుకు వచ్చే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. మూడు రోజులగా ఆర్మీ,ఎస్టీఆర్ఎఫ్,ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ర్యాట్ హోల్ మైనర్లు రంగంలోకి దిగినా సొరంగంలో చిక్కుకున్న వారి జాడ కానరాలేదు. బండరాళ్లు,బురద నీరు,శిథిలాల కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి.
శనివారం (ఫిబ్రవరి 22) ఉదయం కార్మికులు టన్నెల్లో ప్రవేశించి14వ కి.మీ వద్ద పనులు చేస్తుండగా పైకప్పు కూలిపోవడంతో ప్రమాదం సంభవించింది. ఊటనీరు, బురద ఎక్కువగా ఉండడంతో రెస్కూటీం ఘటనా స్థలికి చేరుకోలేకుంది. బురద,మట్టి,నీరు తొలగిస్తే గానీ ఆపరేషన్ సాధ్యం కాదు.పరిస్థితి చూసి నేవీటీంకూడా చేతులు ఎత్తివేసిందనే అనిపిస్తోంది. మట్టితొలగించేందుకు మినీ జేసీబీ రప్పించినా తోడిన మట్టి ఆటంకంగా మారింది. నీటీ తీవ్రత దృష్ట్యా 10 కి.మీ వరకూ వెళ్లడం కష్టమే అంటున్నారు. ఆదివారం (ఫిబ్రవరి 23) టన్నెల్లోపలికి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ ఏమీచేయలేక వెనుతిరిగింది. బోరింగ్ మెషిన్ వద్ద మట్టి, బురదతో టన్నెల్ మూసుకుపోయింది. ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకాలకు కాంపొనెంట్ టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం)ను అమెరికా నుంచి తెప్పించారు.ఈ మెషిన్ కు ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన అనేక సొరంగాలు తవ్విన చరిత్ర ఉంది. ఈ సమస్యను తొలగించేందుకు విరిగిపోయిన బోరింగ్ మిషన్ భాగాన్నితొలగించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం(ఫిబ్రవరి 24) టన్నెల్ సందర్శించారు.ఈ రెస్క్యూ ఆపరేషన్ లో అన్ని విభాగాలకు చెందిన 584 మంది పాల్గొంటున్నారు. స్నిఫర్ డాగ్స్ ను ఉపయోగించినా అవి కూడా లోపలికి ప్రవేశించ లేకపోయాయి.
1980లో అప్పటి సీఎం అంజయ్య ఈ ప్రాజెక్టుకు అక్కమ్మ బిలం వద్ద శంకుస్థాపన చేశారు. 1983లో ఎన్టీఆర్ ఎడమ,కుడి కాల్వలకు శంకుస్థాపన చేసారు. 1995లో ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలాన్ని మార్చారు. నల్గొండ జిల్లా లో ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. 2004లోవైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆఫ్ షోర్ నుంచి టన్నెల్ తవ్వాలని నిర్ణయించారు. 2007లోనిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2010 కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వివిధ కారణాలతో పనులు ఆలస్యం అయ్యాయి. ఆరు సార్లు గడువుపెంచారు. 2026నాటికి పూర్తి చేయాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. రెండు సొరంగాలు,హెడ్ రెగ్యులేటర్,రెండు లింక్ కెనాల్స్,డిండి,నక్కలగండి,ఉదయ సముద్రం సహా బాలెన్సింగ్ రిజర్వాయర్లు ప్రాజెక్టు లో చేర్చారు. టన్నెల్ టూ పూర్తి కాగా,టన్నెల్ వన్ 34.9 కి.మీ మేరపని పూర్తయింది.ఉమ్మడి రాష్ట్రంలో 52 శాతం పనులు పూర్తయ్యాయి. ఈప్రాజెక్ట్ ద్వారా 4.15 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 516 గ్రామాలకు త్రాగునీరు అందుతుంది. ప్రపంచంలోనే పొడవైన 43.93 కి,మీ ఎస్ఎల్బీసీ టన్నెల్. టన్నెల్ పైన మొత్తం కొండలు,అడవులు ఉన్నాయి.టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం కావడంతో అటవీ సంపదకు నష్టం కాకుండా శ్రీశైలం ఆఫ్ షోర్ కొండ క్రింద టన్నెల్ నిర్మిస్తున్నారు.
ఇందులో గాలి దూరదు. ఊపిరాడదు. పైపులు ద్వారా ఆక్సిజన్ పంప్ చేస్తుంటారు. ఇంకా 9 కి.మీ తవ్వితే ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుంది. శ్రీశైలం ఆఫ్ షోర్ నుంచి వృత్తాకార సర్కిల్లో డిండి రిజర్వాయర్ వరకూ మొదటి భాగాన్ని తవ్వుతున్నారు.అక్కడినుంచి గుర్రపుడెక్క ఆకారంలో మరో టన్నెల్ ఇప్పటికే తవ్వారు.ఇక్కడే పైకప్పు కూలింది. ఏదిఏ మైనా సొరంగం తవ్వకాల్లో ఇలాంటి దుర్ఘటన జరగడం 8 మంది జీవితాలు ప్రమాదంలో చిక్కుకోవడం మహా విషాదం. సహాయక చర్యలను మరింత వేగవంతం చేసి టన్నెల్ లో చిక్కుకున్న వారిని ప్రాణాలతో బయటకు తీసుకురావాలని బాధితుల కుటుంబీకులు కన్నీటితో విజ్ఞప్తి చేస్తున్నారు.