అధికారం కూటమిది.. పాలన జగన్ ది.. ఆంధ్రప్రదేశ్ లో విచిత్ర పరిస్థితి!
posted on Feb 25, 2025 10:17AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను మారాననీ, తనలో 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారని గట్టిగా చెప్పారు. చంద్రబాబు క్రమశిక్షణలు, పారదర్శకతకు పెద్ద పీట వేస్తారు. అది పాలనలోనైనా సరే, పార్టీ విషయాలలోనైనా సరే. ప్రభుత్వంలోనైనా, పార్టీలోనైనా సరే గీత దాటిన వారిని ఇసుమంతైనా ఉపేక్షించరు. మందలిస్తారు. బుజ్జగిస్తారు. అప్పటికీ వినకపోతే చర్య తీసుకుంటారు. కక్ష సాధింపు, ప్రతీకారం అన్న వాటికి ఆయన దూరం. చివరాఖరికి ప్రతిపక్షాల తప్పులను ఎత్తి చూపే టప్పుడైనా, వారి తీరును విమర్శించే సమయంలోనైనా ఆయన మాట తూలరు. తన పార్టీకి చెందినవారు మాట తూలినా సహించరు. ఇవే విలువలతో ఆయన గత నాలుగున్నర దశాబ్దాలకు పైగా రాజకీయాలు చేస్తున్నారు. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరిస్తూ, హుందా రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. చంద్రబాబు ఇవే విలువలతో తెలుగుదేశం పార్టీని జాతీయ స్థాయిలోనే రాజకీయ పార్టీలకు ఆదర్శంగా నిలబెట్టారు. జాతీయ పార్టీలలో కూడా కనిపించని క్రమశిక్షణ, ఐక్యత, అంకిత భావం కలిగిన క్యాడర్ తెలుగుదేశం సొంతం.
అయితే 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన వైసీపీ అధినేత జగన్ కారణంగా తెలుగుదేశం నేతలు, క్యాడర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కక్ష సాధింపునకే అధికారం అన్న తీరులో జగన్ రెచ్చిపోయారు. ప్రత్యర్థి పార్టీల నేతలు, కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులతో నిర్బంధాలతోనే జగన్ ఐదేళ్ల పాలన సాగింది. ప్రత్యర్థి పార్టీల నేతలు, కార్యకర్తలపైనే కాదు, తన విధానాలను ప్రశ్నించిన జనంపై కూడా కక్షపూరితంగా వ్యవహరించారు.
దీంతో 2024 ఎన్నికలలో జగన్ పార్టీకి జనం గట్టి బుద్ధి చెప్పారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పగించారు. అదే సమయంలో చంద్రబాబు జగన్ హయాంలో కట్టుదాటి వ్యవహరించిన నేతలు, అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు కూడా తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టను అంటూ ప్రజలకు, పార్టీ క్యాడర్ కు హామీ ఇచ్చారు. అయితే పాలనా పగ్గాలు చేపట్టిన తరువాత.. జగన్ హయాంలో హద్దు మీరి ప్రవర్తించిన వారిపై చర్యల విషయంలో జాగు జరుగుతోంది. ఇది భరించలేని తెలుగుదేశం క్యాడర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేసిన వారు ఎదురుగా దర్జాగా తీరుగుతున్నా వారిపై చర్యలు ఎందుకు లేవంటూ నిలదీస్తున్నారు.
సరిగ్గా ఇదే సమయంలో పైబర్ నెట్ చైర్మన్ గా జీవీ రెడ్డి.. జగన్ హయాంలో ఫైబర్ నెట్ లో జరిగిన అవకతవకలు, అక్రమాలను బయటపెట్టారు. అడ్డగోలు నియామకాలతో అప్పనంనగా ప్రభుత్వం నుంచి వేతనాలు అందుకుంటున్న 400 మందిని వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఒక్క సారిగా జీవీ రెడ్డి తెలుగుదేశం శ్రేణుల దృష్టిలో హీరో అయిపోయారు. సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే ఆయన తొలగింపు ఆదేశాలు ఇచ్చి నెలలు గడుస్తున్నా.. ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడకపోవడంతో జీవీ రెడ్డి అసహనానికి గురయ్యారు. అదే సమయంలో ఒకింత తొదరపాటుగానూ వ్యవహరించారు. విషయాన్ని సంబంధిత మంత్రి దృష్టికో, ముఖ్యమంత్రి దృష్టికో తీసుకెడితే సరిపోయేదానికి ఆయన మీడియా సమావేశం పెట్టి ఫైబర్ నెట్ ఎండీపై రాజద్రోహం ఆరోపణలు చేశారు. దీంతో చంద్రబాబు రంగంలోకి దిగి జీవీరెడ్డిని మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన జీవీ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీ కంటే, వ్యవస్థ కంటే తానే ఎక్కువ అన్నట్లుగా జీవీ రెడ్డి వ్యవహార శైలి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అదే సమయంలో జీవీ రెడ్డికి తెలుగుదేశం క్యాడర్ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. తెలుగుదేశం సోషల్ మీడియాలో జీవీరెడ్డికి మద్దతుగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో చంద్రబాబు తీరు పట్ల అసంతృప్తి కూడా వ్యక్తం అవుతోంది. అయితే ఈ పరిస్థితి రావడానికి కారణం అధికారులు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పని చేయడంలో చూపుతున్న అలసత్వమే కారణమనడంలో అనుమానం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని గమనిస్తుంటే అధికారంలో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఉన్నా.. పాలన మాత్రం జగన్ నియంత్రణలో ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలోనే తెలుగుదేశం క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, జగన్ హయాంలో అంటే 2019 నుంచి 2024 మధ్య కాలంలో కీలక పోస్టులలో ఉన్న కొందరు అధికారులను అలాగే కొనసాగించడంతో, వారు వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వానికి ఇబ్బందులు తీసుకురావడమే కాకుండా, పార్టీకీ, ప్రభుత్వానికీ మధ్య అగాధాన్ని సృష్టిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీనిపై పార్టీ చంద్రబాబు దృష్టి సారించాలంటున్నారు. లేకపోతే అధికారం కూటమిది అయినా పాలన జగన్ దే అన్నట్లుగా జనం కూడా భావించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.