ఛాంపియన్స్ ట్రోఫీ.. సెమీస్‌లోకి భారత్... పాక్, బంగ్లా ఔట్
posted on Feb 25, 2025 9:37AM
.webp)
ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్-ఎ సెమీస్ బెర్తులు తేలిపోయాయి. గ్రూప్‌లోని నాలుగు జట్లు ఇంకా ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉండగానే.. సెమీస్ రేసు ముగిసిపోయింది. రెండేసి విజయాలతో భారత్, న్యూజిలాండ్ నాకౌట్‌కు దూసుకెళ్లగా.. ఆడిన రెండు మ్యాచ్‌లూ ఓడిన పాకిస్థాన్, బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్ గెలుస్తుందేమో అని దింపుడుకల్లం ఆశలతో ఉన్న పాకిస్థాన్‌కు.. ఆ కోరిక తీరలేదు.
బంగ్లాతో మ్యాచ్‌లో కఠిన పరిస్థితులు ఎదురైనప్పటికీ, దృఢంగా నిలిచిన కివీస్.. తనతో పాటు భారత్ సెమీస్ బెర్తునూ ఖాయం చేసింది. 29 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సొంతగడ్డపై ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తున్న సంబరంలో ఉన్న పాకిస్థానీలకు.. తమ జట్టు వరుసగా రెండు ఓటములతో ఆరంభ దశలోనే, అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించడం జీర్ణించుకోలేని విషయం.
దీంతో ఆ దేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ కళ తప్పబోతున్నట్లే. ఈ వైఫల్యం, ముఖ్యంగా భారత్ చేతిలో పరాజయం ఆ దేశ క్రికెట్‌ను కుదేలు చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. మాజీలు జట్టు ప్రదర్శనపై తీవ్రంగా మండిపడుతున్నారు. జట్టును ప్రక్షాళన చేయాలని, సహాయ సిబ్బందిని మొత్తం మార్చాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ దిశగా పీసీబీ కూడా అడుగులు వేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.