ఆరుగురు సుప్రీంకోర్టు జడ్జ్‌లకు స్వైన్ ఫ్లూ!

ఒక వైపు చైనా, కొరియా వంటి దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంటే, మరోవైపు మన దేశంలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ వైరస్ కారణంగా హైదరాబాద్ లో ఓ మహిళ కూడా మృతి చెందింది. అయితే ఈ స్వైన్ ఫ్లూ ఎఫెక్ట్ ఈ సుప్రీం కోర్టుకూ తాకింది. తాజాగా ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ వైరస్ బారినపడ్డారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే అధ్యక్షతన అత్యవసర సమావేశం ఏర్పాటుచేయనున్నట్టు జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రకటించారు. స్వైన్‌‌ఫ్లూ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా, న్యాయవాదులకు స్వైన్‌ఫ్లూ టీకాలు వేయించాలని నిర్ణయించినట్టు జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు.