ఏపీ రాజ్యసభ ఎన్నికల రేసులో అనూహ్యంగా కొత్త పేర్లు?

రాజ్యసభలో ఈ ఏడాది ఖాళీ అవుతున్న 55 స్ధానాల భర్తీ కోసం వచ్చే నెల 26న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు స్ధానాలకూ వచ్చే నెల 6న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నాలుగు స్ధానాలను అధికార వైసీపీ దక్కించుకునే అవకాశముంది. దీంతో ఆ పార్టీలో నాలుగు బెర్తుల కోసం గట్టి పోటీ నెలకొంది. వీటిని బీసీ, ఓసీ, ఎస్సీ, మైనారిటీలకు తలొకటి చొప్పున కేటాయించాలని సీఎం జగన్ గతంలో నిర్ణయించారు. అయితే చివరి నిమిషంలో తీవ్ర పోటీ కారణంగా మార్పులు చేర్పులు తప్పవని భావిస్తున్నారు.

ఏపీ నుంచి ఈసారి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్ధానాల కోసం అధికార వైసీపీలో తీవ్ర పోటీ నెలకొంది. గతంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చి హామీలు, సామాజిక సమీకరణాలు, పార్టీ విదేయత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నాలుగు బెర్తులకు అభ్యర్ధులను ఖరారు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నాలుగు సీట్ల కోసం పార్టీలో పలువురు సీనియర్లతో పాటు సామాజిక వర్గాల వారీగా చాలా మంది రేసులో ఉన్నట్లు సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం మేరకు శాసనమండలి రద్దుతో మంత్రి పదవులు కోల్పోతున్న సీఎం జగన్ సన్నిహిత మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీనియర్లు వైవీ సుబ్బారెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆయన బావ అయోధ్య రామిరెడ్డి వంటి వారు ఉన్నారు. అలాగే బీజేపీ కోటాలో ప్రస్తుతం వైసీపీలోనే ఉన్న మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తనయుడు రంగరాజుకు అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు.

బీసీ కోటాలో నెల్లూరు జిల్లాలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన బీద మస్తాన్ రావుకు ఓ బెర్తు దక్కనున్నట్లు తెలుస్తోంది. అలాగే మైనారిటీ కోటాలో వైసీపీ డాక్టర్ల విభాగం అధ్యక్షుడు మహబూబ్ పేరు వినిపిస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీని అంటిపెట్టుకుని ఉన్న మహబూబ్ కు ఈసారి రాజ్యసభకు పంపితే ఎలా ఉంటుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎంపిక చివరి నిమిషంలో సమీకరణాల ఆధారంగా ఉండొచ్చనే వాదన కూడా ఉంది. మండలి కోటాలో మంత్రులుగా ఉన్న మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ లలో ఒకరికి రాజ్యసభ ఇచ్చి మరొకరికి ప్రాంతీయ అభివృద్ధి మండలి ఛైర్మన్ పదవి కట్టబెట్టొచ్చన్న ప్రచారం జరుగుతోంది. మరో వారం రోజుల్లో తుది నాలుగు పేర్లను జగన్ ఖరారు చేసే అవకాశముంది.