ఏపీ మద్యం కుంభకోణం.. జగన్ బ్యాచ్ కోసం సిట్ వేట
posted on May 8, 2025 3:32PM

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితుల కోసం సిట్ వేట ముమ్మరం చేసింది. ఈ కేసులో కీలక నిందితులు రాజ్ కేసిరెడ్డి, అతడి సహాయకుడు దిలీప్ లు ఇప్పటికే అరెస్టై రిమాండ్ ఖైదీలుగా ఉండగా, జగన్ హయంలో కీలకంగా వ్యవహరించిన మరో ముగ్గురి కోసం సిట్ ఇప్పుడు గాలింపు చర్యలు ప్రారంభించింది. ఈ ముగ్గురూ ఎవరంటే... మాజీ సీఎం జగన్ మాజీ సెక్రటరీ కె.ధనంజయ రెడ్డి, పీఏ పి.కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్, జగన్ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలు చూసే బాలాజీ గోవిందప్పలు. వీరు ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. దీంతో వారు యాంటిసిపేటరీ బెయిలు కోసం సుప్రీం ను ఆశ్రయించారు. సుప్రీం కోర్టు కూడా వారికి అరెస్టు నుంచి ఎలాంటి రక్షణా కల్పించడానికి నిరాకరించడంతో ఇక వారి అరెస్టు లాంఛనమే అన్నట్లు మారింది.
ఈ దశలో ఈ ముగ్గురి కోసం సిట్ వేట ప్రారంభించింది. విజయవాడ వెటర్నరీ కాలనీ లోని ఒక అపార్ట్‌మెంట్‌లోని మాజీ సీఎం జగన్ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి నివాసంలో సిట్ సోదాలు చేపట్టింది. ఇప్పటికే మద్యం కేసులో మాజీ సీఎం జగన్ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, పీఏ కృష్ణమోహన్ రెడ్డి , భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప లను సెట్ అధికారులు నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. అయితే ముగ్గురు నిందితులు తమతమ ఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేసి లొకేషన్ కూడా దొరకకుండా తప్పించుకు పోయినట్టు సిట్ బృందాలు గుర్తించాయి. దీంతో ముగ్గురి నిందితుల కోసం విజయవాడ, హైదరాబాద్‌లో సిట్ బృందాలు గాలిస్తున్నాయి.
ఈ కేసు మొదలైనప్పుడే ఈ ముగ్గురు ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే దీనికి సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో అక్కడ తీర్పు ఇచ్చిన తర్వాత ఇక్కడకు రావాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో తాజాగా ముగ్గురు నిందితులు వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. కానీ వీరికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. దాంతో సుప్రీం కోర్టు ముందుకు వచ్చిన ముగ్గురు నిందితులు, హైకోర్టు నిరాకరించినందుకు తమకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని వినతి చేశారు. సుప్రీం ధర్మాసనం కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ తదుపరి విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.