ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ అడ్రస్ గల్లంతు?!
posted on May 8, 2025 3:22PM
.webp)
ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ కి పెద్ద చరిత్రే ఉందని చెప్పక తప్పదు. వైసీపీ ఏర్పాటు నుంచి జిల్లాకు చెందిన పలువురు కీలక నేతలు ఇక్కడి నుండి రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పే పరిస్థితి ఉండేది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి ఇసుమంతైనా ఎక్కడా కానరావడం లేదు. కేవలం ఒక్కరు, ఇద్దరు మినహా అధికారంలో ఉండగా ఇష్టారాజ్యంగా చెలరేగిపోయి, చక్రం తిప్పిన నేతలెవరూ ఇప్పుడు ప్రజలకు మొహం చూపించే పరిస్థితి లేదు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. గతంలో తిరుపతి, కుప్పం మినహా అన్నింటిలో వైసీపీ బలం స్పష్టంగా కనిపించేది. 2019 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించే కుప్పం తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాలలోనూ వైసీపీ జయకేతనం ఎగురవేసింది. వైసీపీ అధినేత జగన్ ప్రభావం ఆ ఎన్నికలలో ప్రస్ఫుటంగా కనిపిందించి. అయితే వైసీపీ ఐదేళ్ల పాలనతో ఆ పార్టీని జిల్లా జనం పూర్తిగా తిరస్కరించారు. అందుకే 2024 ఎన్నికలలో వైసీపీ పరిస్థితి తలకిందులై పోయింది. ఎ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు, ఆయన తమ్ముడు పెద్దిరెడ్డి ద్వరకానాథ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తంబళ్లపల్లె తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాలలోనూ తెలుగుదేశం విజయబావుటా ఎగుర వేసింది. చంద్రగిరి, పూతల పట్టు నియోజకవర్గాలలో చాల సంవత్సరాల తరవైక టీడీపీ జెండా ఎగురేసింది.
ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జిల్లాలో వైసీనీ నేతల అడ్రస్ ఎక్కడా కనిపించని పరిస్థితి ఉంది. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా ఇసుక దందా నుంచి భూముల కబ్జాల వరకూ చెలరేగిపోయిన నేతలు ఇప్పుడు వారి నియోజకవర్గాలవైపు కూడా చడటం లేదు. అది పక్కన పెడితే ఇంకా ఉన్నాం అని చెప్పుకుంటున్న ఇద్దరు ముగ్గురు నేతలు సైతం ఇంటి గడపదాటి ప్రజలలోకి వచ్చే పరిస్థితి లేదు. వీరిలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఒకరు. ఆయనకు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడి పదవిని కట్టబెట్టారు జగన్. దీంతో ఆ హోదాలో భూమన తన ఇంటి నుంచి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం తప్ప.. ఎక్కడా ప్రజలతో కలిసి లేదా రోడ్డు మీదకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవని సొంత పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి. ఇక ఫైర్ బ్రాండ్ రోజా నియోజకవర్గ నాయకులతో అడపా దడపా సమావేశాలు నిర్వహిస్తున్నారు తప్ప ఇదివరకటిలా యాక్టివ్ గా లేరు. పెద్దిరెడ్డి కుటుంబం అయితే నియోజకవర్గంలోని తమ సొంత గ్రామానికి వెళ్లడానికి కూడా పోలీస్ ప్రొటెక్షన్ కావాల్సిన పరిస్థితి ఉంది. వీరు తప్ప ఇక జిల్లాలో ఎక్కడా మరో వైసీపీ నేత కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు.