ఈ లక్షణాలు ఉంటే ప్రోటీన్ లోపం ఉన్నట్టే..!
posted on Sep 29, 2025 12:48PM

ప్రోటీన్ మన శరీరానికి అత్యంత అవసరమైన మాక్రోన్యూట్రియెంట్లలో ఒకటి. దీనిని "శరీర నిర్మాణ పదార్థం" అని పిలుస్తారు. ఇది ఆరోగ్యకరమైన కండరాలు, చర్మం, జుట్టు, ఎముకలకు సహాయపడుతుంది. అలాగే హార్మోన్లు, ఎంజైమ్‌ల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, భారతదేశంలో ప్రోటీన్ లోపం తీవ్రమైన సమస్యగా మారడం ఆందోళన కలిగించే విషయం. నేటి బిజీ జీవనశైలి, అసమతుల్య ఆహారం కారణంగా చాలా మంది ప్రోటీన్ లోపాన్ని ఎదుర్కొంటున్నారు.
భారతదేశంలోని పట్టణ జనాభాలో 73% మంది ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారు. వీరిలో 93% మందికి రోజుకు ఎంత ప్రోటీన్ తీసుకోవాలో తెలియదు. మరికొంతమందికి అసలు తమకు ప్రోటీన్ లోపం ఉన్నట్టే తెలియదు. అసలు ప్రోటీన్ లోపిస్తే కనిపించే లక్షణాలు ఏంటి? దీన్ని అధిగమించడానికి ఏం చేయాలి? తెలుసుకుంటే..
చర్మం, జుట్టు, గోళ్ళపై ప్రభావాలు..
శరీరంలో ప్రోటీన్ లోపం ఉన్నప్పుడు దాని ప్రభావం మొదటగా చర్మం, వెంట్రుకలు, గోళ్లపై కనిపిస్తాయి. జుట్టు సన్నగా మారడం, జుట్టు ఎక్కువగా రాలిపోవడం, చర్మం పొడిగా, నిర్జీవంగా మారడం, గోళ్ల మీద పొట్టులాగా రావడం లేదా పెళుసుగా మారి చిన్న ఒత్తిడికే విరిగిపోవడం వంటివి జరుగుతాయి. శరీరం ముఖ్యమైన అవయవాలకు రవాణా చేస్తూ చర్మం, జుట్టు, గోళ్లకు ప్రోటీన్ సరఫరా చేయడం తగ్గిస్తుంది. అందుకే ఇలా జరుగుతుంది.
కండరాల నొప్పులు, కీళ్ల నొప్పి..
ప్రోటీన్ లోపం నేరుగా కండరాలను ప్రభావితం చేస్తుంది. శరీరం శక్తి కోసం కండరాల కణజాలాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఫలితంగా కండర ద్రవ్యరాశి తగ్గుతుంది. ఇది బలహీనత, కీళ్ల నొప్పులకు దారితీస్తుంది. ఎక్కువ శారీరక శ్రమ చేయకపోయినా కూడా కండరాల నొప్పి ఉంటే అది ప్రోటీన్ లోపమయ్యే అవకాశం ఎక్కువ.
శరీరంలో వాపు..
తీవ్రమైన ప్రోటీన్ లోపం శరీరంలో.. ముఖ్యంగా పొట్ట, కాళ్ళు, చేతుల్లో వాపుకు కారణమవుతుంది. ఈ పరిస్థితిని ఎడెమా అంటారు. ఇది రక్తంలో అల్బుమిన్ అనే ప్రోటీన్ లేకపోవడం వల్ల సంభవిస్తుంది. ఇది రక్త నాళాలలో ద్రవాన్ని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. ఈ లోపం కణజాలాలలో ద్రవం పేరుకుపోవడానికి కారణమవుతుంది. ఇది వాపుకు దారితీస్తుంది.
బలహీనమైన రోగనిరోధక శక్తి, అనారోగ్యం..
మనిషిలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే ప్రతిరోధకాలు ప్రోటీన్ నుండి తయారవుతాయి. ప్రోటీన్ లోపం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఒక వ్యక్తి తరచుగా ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలకు గురవుతుంటే ప్రోటీన్ లోపం వల్లనే అనేది అర్థం చేసుకోవాలి. తరచుగా జలుబు లేదా ఇతర ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటే అది ప్రోటీన్ లోపానికి సంకేతం కావచ్చు. దీనిని నిర్లక్ష్యం చేయడం చాలా ప్రమాదం.
*రూపశ్రీ.