శిల్పాచౌదరి కన్నింగ్ కహానీలు.. పోలీసులకు చుక్కలు..
posted on Dec 7, 2021 11:54AM
ఆమె మామూలు కిలేడీ కాదు. ఖతర్నార్ క్రిమినల్. 10 రూపాయలు అప్పు పుట్టడమే కష్టమైన ఈ రోజుల్లో.. కోట్లకు కోట్లు అప్పులు చేయడమంటే మాటలా? అందులోనూ, సంపన్నులను బుట్టలో వేసుకోవడం మామూలు విషయమా? అది శిల్పాచౌదరి లాంటి కన్నింగ్ లేడీలకే సాధ్యం అనేలా ఆమె నేరాల చిట్టా పోలీస్ విచారణలో బయటకువస్తోంది. ఫిర్యాదు చేసింది ముగ్గురే అయినా.. ఆమె బాధితులు పదుల సంఖ్యలో ఉంటారంటున్నారు. స్టేషన్ వరకూ వచ్చింది 10 కోట్ల లోపు యవ్వారమే అయినా.. శిల్పాచౌదరి దోచుకుంది 200 కోట్ల వరకూ ఉంటుందని తెలుస్తోంది. కానీ, రెండు రోజుల పాటు విచారించిన పోలీసులు ఆమె నుంచి పెద్దగా ఎలాంటి సమాచారమూ రాబట్టలేకపోయారంటే శిల్పా ఎంత పర్‌ఫెక్ట్ క్రిమినలో అర్థం అవుతోంది. ఖాకీలనే కన్ఫ్యూజ్ చేసేలా పొంతనలేని ఆన్సర్లు చెప్పిందట. ఎవరికీ డబ్బులిచ్చేది లేదని.. ఇప్పటికే అందరికీ ఇచ్చేశానని.. తననే ఓ ముగ్గురు మోసం చేశారని.. ఇలా రకరకాల మాటలు చెబుతూ.. చేతులెత్తేస్తోంది శిల్పా చౌదరి.
అప్పుల్లేవ్.. గిప్పుల్లేవ్.. ఎవరికీ ఏమీ ఇచ్చేది లేవ్.. నా పై కేసు పెట్టిన ఆ ముగ్గురికి మాత్రం అప్పు తిరిగి ఇచ్చేస్తా.. ఇదీ శిల్పాచౌదరి వర్షన్. మరి, ఆ డబ్బులన్నీ ఎక్కడ దాచావ్ అని పోలీసులు అడిగితే.. దిమ్మతిరిగే ఆన్సర్ చెప్పిందట. ‘‘రాధికారెడ్డి, మల్లారెడ్డి, ప్రతాప్‌రెడ్డి దగ్గర నేను డబ్బు పెట్టాను. వారు నన్ను మోసం చేశారు’’ అని వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. సో.. తానే మోసపోయానని.. తన డబ్బే వాళ్లు ఎగ్గొట్టారని చెబుతోంది. విషయం తెలిసి రాధికారెడ్డి వెంటనే పోలీసుల దగ్గరికి వచ్చారు. మాదాపూర్ ఏసీపీ, డీసీపీలను కలిశారు. శిల్పాచౌదరి తన దగ్గర తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వడానికి ముప్పుతిప్పులు పెడుతోందని, ఆమె తనకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అదే నిజమైతే.. శిల్పాచౌదరి ఆ ముగ్గురి పేర్లు చెప్పి చాకచక్యంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని అనుమానిస్తున్నారు.
మరోవైపు.. తనపై ఫిర్యాదు చేసిన వారికి మాత్రమే డబ్బులు తిరిగి చెల్లిస్తానంటూ శిల్పా చెబుతోంది. ఇది మరో ఎత్తుగడ. చాలా మంది సంపన్నులు బ్లాక్‌మనీని వైట్ చేసుకునేందుకు.. శిల్పాచౌదరికీ పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారు. ఆ నగదుకు ఎలాంటి లెక్కాపత్రాలు లేవు. అందుకే, వారెవరూ కేసు పెట్టేందుకు ముందుకు రాలేదు. డబ్బులు పోయినా లబోదిబో మనటం లేదు. కారణం అదంతా బ్లాక్‌మనీ కావడం. ఆ విషయం తెలిసే.. శిల్పా చౌదరి తనపై ఫిర్యాదు చేసిన వారికి మాత్రమే డబ్బులు తిరిగి ఇస్తానని పోలీసులకు చెప్పిందంటున్నారు.
మిగతా వారికి ఎందుకు ఇవ్వరు? అని పోలీసులు ప్రశ్నించగా.. ‘‘వారికి అధిక వడ్డీ చెల్లించాను. మొత్తం లెక్కగడితే.. అసలు కంటే వడ్డీలే ఎక్కువగా ముట్టాయి’’ అని శిల్పా తెలివిగా సమాధానం చెప్పిందని తెలుస్తోంది. ఇలా.. శిల్పాచౌదరి రెండు రోజుల కస్టడీలో పెద్దగా ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయారు పోలీసులు. అందుకే, మిగతా రెండు కేసుల్లో ఐదు రోజుల కస్టడీ కోసం కోరారు.