ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్.. అన్నను టార్గెట్ చేసిన షర్మిల

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు మరింత లోతుగా విచారిస్తున్నారు. ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత.. మళ్లీ, మళ్లీ విచారణకు పిలుస్తున్నారు. గంటలకొద్దీ ఎంక్వైరీ చేస్తూ.. ఆయన నుంచి కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రణీత్ రావుని కూడా సిట్ విచారిస్తోంది. ఆధారాల ధ్వంసం, ఫోన్ ట్యాపింగ్ కోసం ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

బీఆర్ఎస్ హయాంలో రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు సహా వందలాది మంది ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నవంబర్ 15న ఒక్కరోజే 600 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ట్యాపింగ్‌కు ప్రభాకర్ రావు ఆదేశాలిచ్చారని.. ఆయన డైరెక్షన్‌లోనే ఇదంతా జరిగిందని.. ఇప్పటికే అరెస్ట్ అయిన మిగతా నిందితులు తెలిపారు. మావోయిస్టు సానుభూతిపరుల పేర్ల మీద ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తించారు. రివ్యూ కమిటీకి కూడా మావోయిస్టుల పేర్లతోనే నెంబర్లు సమర్పించినట్లు తేలింది. ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సాయం చేస్తున్న వారిపై నిఘా పెట్టి.. పోలీసులతో దాడులు చేయించినట్లు చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ ఓటమికి ఫోన్ ట్యాపింగ్ ఓ కారణమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఆరోపించడం.. రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది.

2023 ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత.. ఎస్ఐబీ ఆఫీసు నుంచి కీలకమైన హార్డ్ డిస్క్‌లు మాయమయ్యాయి. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు.. ప్రణీత్ రావు వాటిని ధ్వంసం చేసి.. మూసీ నదిలో పారేసినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ.. సిట్ అధికారులు కొంత డేటాని సంపాదించారు.  దాంతో.. తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించిన వారితో పాటు సాక్ష్యులను, బాధితులను పిలిచి.. వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. 

ఇలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది.. ముమ్మాటికి నిజమన్నారు. ఇది.. తెలంగాణ, ఏపీ సీఎంల జాయింట్ ఆపరేషన్ అని ఆరోపించారు. కేసీఆర్, జగన్.. ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉండేవారని.. వాళ్ల సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయిందని షర్మిల విమర్శించారు. తన ఫోన్ ట్యాప్ అయ్యిందని.. వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారని, తన ఫోన్ ట్యాప్ చేసిన ఆడియోని తనకు వినిపించారన్నారు. ఈ కేసులో.. ఎలాంటి విచారణకైనా వస్తానన్నారు వైఎస్ షర్మిల.

మరోవైపు.. సిట్ అధికారులు ప్రభాకర్ రావును వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా.. 300 అజ్ఞాత ప్రొఫైల్స్, ఇతర కీలక వ్యక్తుల ఫోన్ల ట్యాపింగ్‌పైనే ప్రశ్నిస్తున్నారు. కేసుని ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు.. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావును.. సిట్ పదే పదే ప్రశ్నిస్తోంది. ఈ విచారణలో మరిన్ని కీలక వివరాలు బయటకొచ్చే అవకాశం ఉంది.