జడ్ ప్లస్ భద్రత కోసం హైకోర్టుకు జగన్.. పిటిషన్ విచారణ వాయిదా
posted on May 10, 2025 10:27AM
.webp)
కిందపడ్డా నాదే పై చేయి అంటూ బుకాయించడంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ప్రస్తుత ఎమ్మెల్యే జగన్ దిట్ట. సానుభూతి కోసం తనపై తానే దాడులు చేయించుకున్న చరిత్ర ఆయనది. గులకరాయి దాడి ఆ కోవలోకే వస్తుంది. ఈ విషయాన్ని వైసీపీ శ్రేణులు సైతం అప్పట్లో అంతర్గత సంభాషణల్లో అంగీకరించారు. అన్నిటికీ మించి అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అన్నట్లుగా జగన్ వ్యవహార శైలి ఉంటుందన్నది ఇప్పటికే పలుమార్లు రుజువైంది.
ఇక 2019 ఎణ్నికలలో విజయం కోసం బాబాయ్ హత్య, కోడికత్తి వంటి జగన్ డ్రామాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలా రకరకాల విన్యాసాలతో పాటు ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన జగన్ ఐదేళ్లు ఏపీ ప్రజలకు నరకం చూపించారు. జగన్ హయాంలో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు పనులకోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటూ వేధింపులు, ప్రతీకారమే పాలన అన్నట్లుగా జగన్ ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రజలను వేధించారు. ఆయన పాలనలో ఏ వర్గమూ కూడా హ్యాపీగా లేదు. జగన్ అరాచక పాలనకు విసిగిపోయిన ఏపీ జనం, 2024 ఎన్నికల్లో ఏ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలకు గట్టి గుణపాఠం చెప్పారు. కేవలం 11 సీట్లలో మాత్రమే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అంటే.. వైసీపీకి ప్రతిపక్ష హోదాకూడా ఏపీ ప్రజలు ఇవ్వలేదు.
అయినా జగన్ ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ వస్తానని భీష్మించుకు కూర్చున్నారు. తీరా అసెంబ్లీ సభ్యత్వం పోతుందన్న భయంతో మొక్కుబడిగా ఒక సారి అసెంబ్లీకి హాజరై మమ అనిపించారు. ఇప్పుడు తాను సీఎంగా ఉండగా ఏ విధంగా అయితే జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉండేదో.. ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా కూడా తనకు అటువంటి భద్రతే కావాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. తనకు జడ్ ప్లస్ భద్రత పునరుద్ధరించాలంటూ ఆయన గురువారం (మే 8)న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందనీ, అందుకే సీఎంగా గతంలో తనకు ఏ విధంగా జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉండేదో.. అలాగే ఇప్పుడు కూడా దానిని కల్పించాలనీ, అలా జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ జగన్ ఆ పిటిషన్ లో కోరారు. జగన్ పిటిషన్ శుక్రవారం ( మే 9) విచారణకు వచ్చింది. కోర్టు ఆ పిటిషన్ పై తక్షణ నిర్ణయం వెలువరిస్తుందని జగన్ ఆశించారు. అయితే కోర్టు మాత్రం పిటిషన్ విచారణను వేసవి సెలవుల తరువాతకు వాయిదా వేసింది. దీంతో జగన్ కు హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లైంది.