పాలు పోసిన చేతినే కాటేసిన విషనాగు .. టర్కీ!
posted on May 10, 2025 12:31PM

పాముకు పాలు పోసినా విషమే కక్కుతుంది, అది సర్ప జాతి లక్షణం. కానీ.. మనిషన్నవాడు, మానవత్వం ఉన్న వాడు ఎవరైనా చేసిన మేలును మరిచి పోడు. మరిచికూడదు. మరిచి పోతే వాడు మనిషి కాదు. విశ్వాస ఘాతుక విష సర్పం కంటే ప్రమాదకరమైన మానవ మృగం అనవచ్చును. ఈ ధర్మం వ్యక్తులకే కాదు దేశాలకూ వర్తిస్తుంది. కష్ట కాలంలో ఆదుకున్న దేశాన్నిఅవసర సమయంలో ఆదుకోకపోకా వెన్ను పోటు పొడవడం దుర్మార్గాలలో కెల్లా మహా దుర్మారం. అమానుషం. అవును.. సాయమ చేసిన వారికి తిరిగి సాయం చేయక పోయినా ఫర్వాలేదు కానీ సాయం చేసిన దేశంపై కత్తులు దూస్తే, దుశ్చర్యకు, దుర్మార్గానికి పాల్పడితే అలాంటి దేశాలను, అలాంటి పాలకులను విశ్వాస ఘాతుకులు, విష నాగులు, అంతకు మించిన దుర్మార్గ దురంధరులు అనవచ్చును.
ఇప్పడు భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం కాని అప్రకటిత యుద్ధం జరుగతున్న సమయంలో టర్కీ, అలాంటి దుర్మార్గానికి పాల్పడింది. విష సర్పమై పాలు పోసిన భారత దేశాన్నే కాటు వేసింది. రెండేళ్ళ క్రితం 2023లో టర్కీ, సిరియాలలో భారీ భూకంపం సంభవించింది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యంగా టర్కీ లో భూకంప ప్రభావం చాలా ఎక్కువగా వుంది. ప్రాణ, ఆస్తి నష్టంకూడా టర్కీలోనే ఎక్కువగా జరిగింది. భూకంప ప్రభావానికి దేశంలోని అనేక ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇంచు మించుగా 50 వేల మందికి పైగా చనిపోయారు.
అలాంటి సమయంలో.. అంతటి విపత్కర పరిస్థితిలో టర్కీకి నేనున్నానంటూ స్నేహ హస్తం అందించిన తొలి దేశం భారత దేశం. ప్రపంచ దేశాలన్నీ మీన మేషాలు లెక్కిస్తున్న సమయంలోనే భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ఆపరేషన్ దోస్త్ పేరిట స్నేహ హస్తాన్ని అందించింది. భారీగా మానవతా సాయాన్ని అందించింది. బాధితులకు ఆహారం, మందులు సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కిసాన్ డ్రోన్లను మోదీ ప్రభుత్వం పంపింది. అంతటి కష్ట కాలంలో భారత దేశం, మోదీ ప్రభుత్వం మానవతా దృక్పథంతో సాయం అందిస్తే ఇప్పుడు టర్కీ భారత దేశం చేసిన సహాయాన్ని మరిచి భారత్‌పై దాడికి పాకిస్థాన్‌కు అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తోంది.
పాకిస్థాన్ గత రెండు రోజుల్లో భారీ స్థాయిలో భారత్ పై డ్రోన్ దాడులు చేసింది. వందల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది. అయితే మన సేనలు పాకిస్థాన్ ప్రయోగించిన ప్రతి డ్రోన్ ను గాలిలోనే పేల్చి వేశాయి. నేల కుల్చాయి. పాక్ ప్రయోగించిన డ్రోన్లన్నీ టర్కీ సరఫరా చేసినవే కావడం ఆ దేశ నిజరూపాన్ని ప్రపంచం ముందుంచింది.అవును. ఆ శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షించారు. అవన్నీ టర్కీకి చెందిన అసిస్ గార్డ్ సోనగర్ డ్రోన్లుగా ధ్రువీకరించారు.
అయితే.. ఒక విధంగా ఇది అనూహ్య పరిణామంమ కాదు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు తొలి నుంచీ భారత దేశం పట్ల విపరీతమైన ద్వేషం వుంది. అదేమీ రహస్యం కాదు. ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో ఆయన బహిరంగంగా వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రపంచమంతా ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తున్న సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను ఎర్దొగాన్ కలిశారు. ఆ దేశానికి వత్తాసు పలికారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించలేదు. అంతే కాదు.. ఉగ్రదాడిలో మరణించిన పర్యాటకుల కుటుంబాలకు సానుభూతి అయినా వ్యక్తం చేయలేదు.
పహల్గాం ఉగ్రదాడి జరగగానే పాకిస్థాన్‌పై భారత దేశం దాడి చేస్తుందని టర్కీ ముందుగానే ఊహించింది. ప్రపంచమంతా భారత్ దేశం పట్ల సంఘీభావం తెలుపుతున్న సమయంలో ఆరు సైనిక విమానాల్లో పాక్‌కు ఆయుధాలను ఎర్డోగాన్ ప్రభుత్వం పంపింది. టర్కీ సి-130ఈ హెర్క్యూలస్ విమానం గత నెల 28న పాకిస్థాన్‌లో దిగిన విషయాన్ని అంతర్జాతీయ గగనతల నిఘా సంస్థలు కూడా గుర్తించాయి. అయితే ఇంధనం నింపుకొనేందుకు తమ యుద్ధ విమానం అక్కడ దిగిందని ప్రకటించి ప్రపంచాన్ని మోసం చేసే ప్రయత్నం చేసింది. తర్వాత ఓ యుద్ధనౌకను కూడా కరాచీ నౌకాశ్రయానికి పంపింది. ఇప్పుడు ఆ ఆయుధాలనే భారత్‌పై పాకిస్థాన్ ప్రయోగిస్తోంది. పహల్గాం దాడి జరిగిన తర్వాత ముస్లిం దేశాల్లో టర్కీ , అజర్ బైజాన్ మాత్రమే పాక్‌కు మద్దతిస్తున్నాయి. కాశ్మీర్ అంశంలో గతంలో ఎర్డోగాన్ అనేక సార్లు అంతర్జాతీయ వేదికలపై బహిరంగంగా భారత దేశం పై విమర్శలు చేశారు. ఇప్పడు పాముకు పలు పోసినా విషమే చిమ్ముతుందని, టర్కీ మరో మారు రుజువు చేసింది.