పెద్దన్నకు ఝలక్.. ట్రంప్ మధ్యవర్తిత్తం అక్కర్లేదని తేల్చి చెప్పిన ఇండియా!
posted on May 10, 2025 9:52AM

నేను చేసేదేముంది? అది మీ గొడవ మీరే తేల్చుకోండి అంటూ చెబుతూ వస్తున్న అమెరికా ఇప్పుడు.. పాక్ భారత్ లక్ష్యంగా పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం అణిచివేతకు కఠిన నిర్ణయం తీసుకుంటున్న వేళ.. తగుదునమ్మా అంటూ మధ్యవర్తిత్వం చేయడానికి వచ్చింది. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పెద్ద మనిషిని నేనున్నాను కదా? మధ్యవర్తిత్వం చేస్తాను.. నా మాట వినండి అంటూ భారత్ కు ప్రతిపాదన పంపారు. అయితే అందుకు భారత్ నిర్ద్వంద్వంగా నో చెప్పింది. అగ్రదేశాధినేతను అన్న దర్పాన్ని ప్రదర్శించిన ఆయనకు భారత్ తన సమాధానంతో దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. మోడీ నాకు మంచి మిత్రుడు అంటూ పదేపదే చెప్పే ట్రంప్ కు అదే మోడీ స్నేహం స్నేహమే.. కానీ అంతర్గత విషయాల్లో జోక్యాన్ని భారత్ ఇసుమంతైనా అంగీకరించదని కుండబద్దలు కొట్టేశారు. అసలింతకీ ఏం జరిగిందంటే..
ఇండియా, పాకిస్థాన్ మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ ఇక తాడో పేడో తేల్చుకోవడానికి రెడీ అయిపోయింది. ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు నిర్వహించింది. దాదాపు 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసేసింది. ఈ క్రమంలో వందమందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టింది. అలా హతమైన ఉగ్రవాదులలో పాక్ తన ఇంటల్లుడికి చేసినట్లు రాచమర్యాదలు చేస్తూ అన్ని విధాలుగా రక్షణగా నిలుస్తున్న ఉగ్రవాది మసూద్ అజహర్ సోదరుడు రవూఫ్, బంధువులు కూడా ఉన్నారు. ఈ దాడుల్లో నిషేధత ఉగ్ర సంస్థ జై షే అహ్మద్ దాదాపు నామరూపాల్లేకుండా పోయింది. దీంతో పాకిస్థాన్ భారత్ లక్ష్యంగా దాడులకు దిగింది. ప్రతిగా ఇండియా ఎదురుదాడులు చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్యా యుద్ధవాతావరణం నెలకొంది. ఇంకా చెప్పాలంటే అప్రకటిత యుద్ధం జరుగుతోంది.
సరిగ్గా ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్దరికం అంటూ రంగ ప్రవేశం చేశారు. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ముందుకు వచ్చారు. ఉగ్రవాదంపై పోరుకు నాయకత్వం వహిస్తానంటూ చెప్పుకునే అగ్రరాజ్యం.. ఇంత కాలం భారత్ లక్ష్యంగా పాక్ ప్రేరేపిత ఉగ్రదాడులపై ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడని ట్రంప్.. ఇప్పుడు పాక్ అన్ని విధాలుగా నష్టపోయి.. చేతులెత్తేస్తున్న వేళ.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భారత్ ఉగ్రవాదంపై తుది పోరు సాగిస్తున్న సమయంలో దాడులు ఆపండి.. మధ్యవర్తిత్వం చేస్తానంటూ ముందుకు వచ్చారు. ఇందుకు భారత్ నిర్ద్వంద్వంగా నో చెప్పేసింది. మీ పెద్దరికం మీ వద్దే ఉంచుకోండంటూ సున్నితంగా కాదు.. ఒకింత నిష్కర్షగానే చెప్పింది. పాకిస్థాన్ తో తమ సమస్యలు పూర్తిగా ద్వైపాక్షికమని తేల్చేసింది. ఏది ఉన్నా పాకిస్థాన్ తోనే తేల్చుకుంటామని స్ఫష్టం చేసి ట్రంప్ నోరు మూయించింది. ఉగ్రవాదం మరియు సరిహద్దు సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలంటే ఫస్ట్ పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపా లని అల్టిమేటమ్ ఇచ్చేసింది.