సమావేశాల తర్వాత సంచలన నిర్ణయం ?

భారత రాష్ట్ర సమితి, బీఆర్ఎస్’లో ఏమి జరుగుతోంది? ఇటు అసెంబ్లీలో అటు బయట జరుగతున్న పరిణామాలను గమనిస్తే... అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే కీలక, సంచలన నిర్ణయాలు వెలువడే  అవకాశాలున్నాయని గులాబీ పార్టీలో వినిపిస్తున్న గుసగుసలను బట్టి తెలుస్తోంది.

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పడం సంప్రదాయం. అయితే, ఈసారి  గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగిన సందర్భంలో ముఖ్యమంత్రి అసలు సభకు రాలేదు. ముఖ్యమంత్రికి బదులుగా, మంత్రివర్గంలో రెండవ స్థానంలో ఉన్న హోం మంత్రి లేదా ఆ తర్వాతి స్థానంలో ఉన్న ఆర్థిక మంత్రి ఆయన కాదంటే శాసన సభ వ్యవహరాల శాఖ మంత్రి సమాధానం చెప్పడం సంప్రదాయం.

కానీ, ఈ అందరినీ కాదని, మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి,కే. తారక రామారావు, సమాధానం ఇచ్చారు. ఇది దేనికి సంకేతం? నిజమే. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా,ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్. అందులో అనుమానం  లేదు. కొద్ది కాలం క్రితం వరకు ఎవరికైనా కొద్ది పాటి అనుమానాలు, ఆశలు ఉంటే ఉన్నాయేమో కానీ, ఈటలకు ఉద్వాసన పలికిన తర్వాత వేగంగా సీన్ మారిపోయిందని తెలంగాణ భవాన్ క్యారిడార్లలో ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఆ లెక్కన, నెంబర్లతో సంబంధం లేకుండా, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతటి వాడు కేటీఆర్... అందులో అనుమానం లేదు.అందుకే కావచ్చును, లోలోపల ఏమనుకున్నారో ఏమో కానీ, హరీష్ రావు సహా మంత్రులు ఎవరు, కేటీఆర్ అనధికార పదోన్నతిపై బయటకు ఒక్క మాట అయినా మాట్లాడలేదు.

అదీగాక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై జరిగిన చర్చకు ఎవరు ప్రభుత్వం తరపున ఎవరు సమాధానం చెప్పాలనే విషయంలో సంప్రదాయమే కానీ, ప్రత్యేక నిబంధన ఏదీ ఉన్నట్లు లేదు. అందుకే, కేటీఆర్ ట్రయిల్ రన్ సాఫీగా సాగిపోయిందని అంటున్నారు. నిజానికి, ఒక్క కేసీఆర్ మినహా మిగిలిన మంత్రులు, పార్టీ నాయకులు అందరూ కేటీఆర్ ‘బాస్’ గా అంగీరించేందుకు మానసికంగా సిద్ధమయ్యారు అంటున్నారు.  

అయితే, రాజకీయ వర్గాల్లో మాత్రం ఇది దేనికి సంకేతం? అనే చర్చ అయితే జోరుగా సాగుతోంది. ఓ వంక  ముఖ్యమంత్రి కేసేఆర్ ఇక జాతీయ రాజకీయాలపైనే దృష్టిని కేంద్రీకరిస్తారనే వార్తలు వస్తుంటే మరోవంక  కొద్ది రోజుల క్రితం వరకు, జాతీయ రాజకీయాల పై అంతగా ఆసక్తి చూపని, బీఆర్ఎస్ కార్యకలాపాలకు కొంత దూరంగా ఉంటూ వస్తున్న కేటీఆర్, హటాత్తుగా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ రోల్ మోడల్ గా కనబడుతున్నారని  గంభీర ప్రకటనలు చేయడం, అలాగే, శాసన సభలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల సహా ప్రతిపక్ష సభ్యులతో మింగిల్ అవుతున్న తీరు చూస్తే ఏవేవో అనుమానాలు, ఎవేవో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే అనేక మార్లు ముహూర్తం దాకా వచ్చి వాయిదా పడుతూ వచ్చిన కేటీఆర్ పట్టాభిషేకానికి నిజ ముహూర్త సమయం సమీపించిందా? అనే అనుమానాలు జోరుగా వినవస్తున్నాయి.  అలాగే, ఇదీ అని స్పష్టంగా లేకున్నా బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత కీలక నిర్ణయాలు ఉంటాయనే చర్చ, రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా బీఆర్ఎస్ వర్గాల్లో ప్రముఖంగా వినవస్తోంది. అయితే అది కేటీఆర్ పట్టాభిషేకమా? అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలా? అదీ ఇదీ రెండునా అనే విషయంలో మాత్రం ఎవరూ క్లారిటీ ఇవ్వలేక పోతున్నారు.

ఫిబ్రవరి 17, ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు .. అదే రోజున నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం ... అదే రోజున ... ఇంకేమైనా (కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం)...కూడా ఉంటుందా ... అంటే, కేటీఆర్ లో పొంగిపొరలుతున్న ఉత్సాహం ఉండవచ్చునని అంటోందని అంటున్నారు. చూడాలి మరి..ఏమవుతుందో ...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu