సీమాంధ్ర యంపీలు రాజీనామాలకు సిద్ధం

 

సమైక్యాంధ్ర ఉద్యమాలతో అట్టుడుకుతున్న సీమాంద్రాలో అడుగుపెట్టలేని పరిస్థితుల్లో డిల్లీలో తచ్చట్లాడుతున్న సీమాంధ్ర యంపీలు, కేంద్ర మంత్రులు నిన్నకాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్, షిండే, మనిష్ తివారీ, చాకో తదితరులు రాష్ట్ర విభజన ఖాయం అంటూ వరుసపెట్టి చేసిన ప్రకటనలతో వారు మరింత ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకొన్నారు. దానికితోడు నిన్ననే ఏపీఎన్జీవోలు మరో మారు విజయవాడలో భారీఎత్తున ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సమైక్య సభను నిర్వహించి ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించడం, అదే మాటను నేడు వారు హైకోర్టుకి కూడా ఖరాఖండిగా తెలియజేయడంతో, పదవులు పట్టుకొని వ్రేలాడుతున్న స్వార్ధ రాజకీయ నేతలుగా తమపై ముద్ర పడుతుందని ఆందోళన చెందుతున్నారు.

 

ఇక దిగ్విజయ్ సింగ్ “మీరు రాజీనామాలు చేయడలచుకొంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు”నని చెప్పడంతో సీమంధ్ర యంపీలు ఉండవల్లి, రాయపాటి, లగడపాటి, సాయిప్రతాప్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, వెంకటరామిరెడ్డి, ఎస్పీవైరెడ్డిలు తమ పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. వారు ఈనెల 24న స్పీకర్ కలిసేందుకు అపాయింట్మెంటు కూడా తీసుకొన్నారు. అదేరోజు వారు తమ రాజీనామాలను ఆమోదింపజేసుకొంటామని చెపుతున్నారు. కేంద్రమంత్రులు మాత్రం ఇంకా రాజీనామాలపై ఊగిసలాటలో ఉన్నట్లు సమాచారం. అయితే సీమాంధ్ర యంపీలు నిజంగా రాజీనామాలు చేయబోతున్నారా లేదా? అనే సంగతి బహుశః 24న తేలిపోవచ్చును.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu