సమ్మె కొనసాగింపుకే ఎన్జీవోల మొగ్గు
posted on Sep 21, 2013 2:41PM
.jpg)
ఏపీఎన్జీవోల నిరవధిక సమ్మెపై హైకోర్టులో దాఖలయిన కేసు నాలుగవ రోజు కూడా కొనసాగింది. ఉద్యోగులు ఇన్నిరోజులు సమ్మె చేయడం భావ్యం కాదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అందువల్ల వెంటనే సమ్మె విరమించమని కోర్టు కోరింది. అయితే, తాము కేంద్రం తన నిర్ణయం మార్చుకోనేంతవరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని వారు కోర్టుకు తేల్చి చెప్పారు. కోర్టు ఈ కేసును మళ్ళీ సోమవారానికి వాయిదా వేసింది. ఆ రోజునే కోర్టు తన తీర్పు వెలువరించే అవకాశం ఉంది.
నిన్న కేంద్రమంత్రి మనిష్ తివారీ, హోంమంత్రి షిండే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ మరియు ఏఐసీసీ ప్రతినిధి చాకో రాష్ట్ర విభజన చేసి తెలంగాణా ఏర్పాటు చేయడం తధ్యమని ఖరారు చేసిన నేపధ్యంలో ఏపీఎన్జీవోలు ఇప్పటికీ అంతే పట్టుదలగా వ్యవహరించడం విశేషమే. ఉద్యోగుల ఈ నిర్ణయంతో నేరుగా ఇప్పుడు రాజకీయ నేతలు, పార్టీలపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇంతవరకు మూడు ప్రధాన పార్టీలను ఉపేక్షిస్తున్న ఉద్యోగ సంఘాలు, ఇక నుండి నేరుగా వారిని డ్డీ కొనే ప్రయత్నం చేయవచ్చును. దానివల్ల ముఖ్యంగా కాంగ్రెస్, తెదేపా నేతలకు ఇబ్బందులు తప్పవు. ఇంత జరుగుతున్నా రాజీనామాలు చేసేందుకు నిరాకరిస్తున్న కాంగ్రెస్ నేతలు, సమైక్యంద్రాపై నోరుమెదపని తెదేపా ముందుగా ఇబ్బందులో పడవచ్చును.
ఇక వైకాపాను కూడా ఉద్యోగులు నమ్ముతున్నట్లు దాఖలాలులేవు. సమ్మె కాలానికి ఉద్యోగులకు జీతాలు, బోనసులు ఇస్తామని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఇచ్చిన ఆఫరును ఏపీఎన్జీవోల నాయకుడు అశోక్ బాబు నిర్ద్వందంగా తిరస్కరించడమే అందుకు ఉదాహరణ. సీమాంధ్రలో రాజకీయంగా పైచేయి సాధించడానికే వైకాపా సమైక్యాంధ్ర ఉద్యమాలు చేస్తోందని వారు భావించడమే అందుకు ప్రధాన కారణం.
ఏమయినప్పటికీ, యన్జీవోలు సమైక్యాంధ్ర ప్రకటన వెలువడే వరకు సమ్మె కొనసాగించాలని దృడ నిశ్చయం ప్రదర్శించడం రాజకీయపార్టీలపై తీవ్ర ప్రభావం చూపబోతోంది.