గన్నవరం నుండి బాలకృష్ణ పోటీ
posted on Sep 21, 2013 7:41PM
.jpg)
వచ్చే సాధారణ ఎన్నికలలో శాసనసభకు పోటీ చేస్తానని నందమూరి బాలకృష్ణ చాలా కాలం క్రితమే ప్రకటించారు. మొదట ఆయన కృష్ణ జిల్లా గుడివాడ నుండి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆయన గన్నవరం నుండి పోటీ చేయాలనుకొంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఆయన గన్నవరం నుండే పోటీ చేసేందుకు రంగం సిద్ధం అవుతోందని తెలుస్తోంది.
ప్రస్తుత తెదేపా సిట్టింగ్ యం.యల్.ఏ. దాసరి బాలవర్ధన్ కు కృష్ణాజిల్లా సహకార పాలసంఘం అద్వర్యంలో నడుస్తున్న విజయ డెయిరీ బోర్డులో కీలక పదవి కట్టబెట్టి, ఆయన స్థానం బాలకృష్ణకు కేటాయించాలని తెదేపా ఆలోచిస్తున్నట్లు సమాచారం. కానీ, తెదేపా సీనియర్ నేత వల్లభనేని వంశీ గన్నవరం సీటు తనకే కేటాయించాలని మొదటినుండి కోరుతున్నారు.
ఒకవేళ గన్నవరం సీటు తనకి ఇవ్వనట్లయితే రాజకీయాలు వదిలిపెట్టి పోతానని వంశీ ఇదివరకు అన్నారు. మరి ఇప్పుడు బాలకృష్ణ గన్నవరం నుండి పోటీకి దిగితే వంశీ వేరే చోటి నుండి పోటీ చేయడానికి ఇష్టపడతాడా? లేక పార్టీకి గుడ్ బై చెప్పి వైకాపాలోకి వెళ్ళిపోతారా అనేది టికెట్స్ కేటాయింపు మొదలయితే గానీ తెలియదు.