ఆదివాసుల జీవితాలను ఆదుకోండి!

మనుషులు నాగరికులు కాకముందు వారి జీవితం వేరుగా ఉండేది.  మనిషి కోతి నుండి పుట్టాడని ఆదిమమానవుడు కాలక్రమంలో మార్పులకు లోనవుతూ నేడు నాగరిక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, నాగరికుడిగా బ్రతుకున్నాడని చెబుతారు. ఈ నాగరిక అనాగరిక అంశాల మధ్య తేడాలు ఎన్ని ఉన్నా, ఆ రెండింటిలో ఉన్న మనుషులు వారి వారి జీవితాలను కొనసాగించడానికి పోరాటం చేయక తప్పదు. అయితే కాలంతో కొన్ని మాత్రమే అభివృద్ధి చెందినట్టు మనుషులు కూడా కొందరే అభివృద్ధి చెంది నాగరిక సమాజంలో కొందరు, ఆటవిక సమాజంలో కొందరు ఉండిపోయారు. 

అడవులను నమ్ముకుని, ప్రకృతి మధ్య, ఆటవిక వనరులను ఉపయోగించుకుంటూ, ఆ అడవినే దైవంగా భావిస్తూ బ్రతుకుతున్న ఆటవిక జాతులు చాలా ఉన్నాయి. సమాజంలో కుల, మత, వర్గ భేదాలు, ఆర్థిక వ్యవస్థ, అన్నిటికి మించి స్వార్థంగా ఆలోచించడం వల్ల ఇలాంటి ఆటవిక జాతులకు నేటికి సరైన న్యాయం అంటూ జరగడం లేదు. అడవులలో నివసించేవారిని ఆదివాసీలు అంటారు. గిరిజనులైన వీరు సంచారజీవితాన్ని గడుపుతూ ఉన్నచోట అనుకూలమైన వ్యవసాయం చేసుకోవడం, ప్రకృతి వనరుల మధ్య బ్రతకడం, ముఖ్యంగా అటవీ ఉత్పత్తులను దగ్గర్లోని సంతల్లో అమ్మడం చేస్తూ జీవిస్తారు.

ప్రపంచ వ్యాప్తంగా సుమారు "వంద దేశాలలో" "అయిదు వేల ఆదివాసీ తెగలు" ఉన్నట్టు గుర్తించారు. వీరిలో ఒక్కో తెగ ఒక్కో భాష మాట్లాడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆదివాసీ తెగలు "ఆరువేల ఏడువందల" భాషలు మాట్లాడుతున్నారు. మొత్తంమీద "వీరి జనాభా" చూస్తే సుమారు "నలభై కోట్లకు" పైన ఉంది. ప్రపంచ జనాభాలో వీరి జనాభా శాతం తక్కువే అయినప్పటికీ అభివృద్ధి చెందుతున్న ప్రపంచీకరణలో ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాడాల్సి వస్తోంది. 

ఆదివాసీల జీవనశైలి వారి అలవాట్లు, సంప్రదాయాలు అన్నీ ఎంతో విశిష్టమైనవి. వారి సంస్కృతి సంప్రదాయాలను, వారి హక్కుల్ని కాపాడటం కోసం ప్రతి సంవత్సరం ఆగష్టు 9 వ తేదీన ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలని 1993లో ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. ఈ తీర్మానం అమలు అయిన తరువాత  అడవులపై హక్కులు ఆదివాసులకే ఉన్నాయని 2010 జూలై 14న జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రకటించారు. అయితే అది అమలు కాలేదు. 

దేశ పార్లమెంటుల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆదివాసీలు ఉన్నా ఆదివాసీల అభివృద్ధి వారి హక్కుల కోసం నోరుతెరచి మాట్లాడేవారు వాటిని సాధించుకోవాలని ప్రయత్నం చేసేవారు కనిపించడం లేదు. కారణం వారిలో వారే స్వార్థపరులుగా మారిపోవడం కూడా. 

ఉప్పుతో కూడా కోట్ల వ్యాపార సామ్రాజ్యాలు నడుపుతున్న నేటి వ్యాపార అధినేతల మనసులో ఆదివాసులు అంతరించిపోతే ఎంతో ఆటవిక భూములు, అక్కడ ఉత్పత్తులతో వ్యారసామ్రాజ్యాన్ని విస్తృతం చేసుకోవాలనే ఆలోచనలే ఆదివాసుల జీవితాలను ప్రమాద కోరల్లో నిలబెడుతున్నాయి. ఈ ఆదివాసుల సంరక్షణకు నడుం బిగిస్తూ నక్సల్స్ వంటి పోరాట బృందాలు ఏర్పడ్డా వారికి కూడా నిరంతరం హింసాయుత జీవితం, ప్రాణం మీద భరోసాలేని బ్రతుకు దిక్కవుతోంది.

అటవీ భూముల కోసం, ఆ భూముల్లో ఖనిజాల కోసం, ఇతర ఉత్పత్తుల కోసం, విలువైన కలప కోసం ఆశపడి పూర్తిగా ఆదివాసులని అంతం చేయాలని అనుకుంటున్న నేటి నాగరిక సమాజానిది ఎలాంటి మనస్తత్వమో ఆలోచిస్తే అర్థమవుతుంది.

ఎన్నో రకాల కుటీర పరిశ్రమలు, చేతి కళలు, ఆరోగ్య రహస్యాలు, ఆయుర్వేద మూలికలకు నిలయమైన అడవులను నిర్వీర్యం చేస్తూ అక్కడి ఆదివాసులకు నరకం చూపించడం మృగలక్షణం అనే మాట సరిగ్గా సరిపోతుంది. మానవ నాగరిత ప్రారంభమైన అడవులను, మానవ జీవితం మొదలైన విధానాన్ని అంతం చేయడం అంటే నడవడానికి సహకరిస్తున్న కాళ్ళను నరికేసుకోవడమే. ఆ తరువాత ఈ ప్రపంచంలో మనిషి ఉనికి కోసం చాలా కష్టాలు పడి వెతకాలి. ఎందుకంటే మనుషులు మృగాలుగా మారిపోయాక నిజమైన మనుషులు కనబడతారో లేదో మరి.

 మనసున్నవారు ఆదివాసులకు చేతనైన సహాయం చెయ్యాలి. విద్య, వైద్యం వంటి వసతులు కలిగించాలి. అప్పుడు వాళ్ళు తమ సామర్త్యాన్ని చాటిచెబుతారు. సహాయం చేసే ఉద్దేశ్యం లేనివారు ఎవరి జీవితాల్ని వాఫు చూసుకోవాలి. అంతేకానీ వారి జీవితాలను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టి వారిని ఇబ్బందిపెట్టకూడదు.

ప్రస్తుతం భారత రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళ ద్రౌపతి ముర్ము ఎంపికైన సందర్భంగా చాలామంది ఆదివాసీ ప్రజల గురించి మాట్లాడుతున్నారు. అయితే ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏ తెగలో అయినా ఏ జాతిలో అయినా ఒక వ్యక్తి దేశ స్థాయి పదవిని, గౌరవాన్ని పొందినంత మాత్రాన ఆ తెగలోనూ, ఆ జాతి లోనూ మార్పు వచ్చేయదు. ప్రతి మనిషి మేలైన జీవితం కోసం పాటుపడాల్సిందే. కాబట్టి వారి జీవితం కోసం తపించే ఆదివాసులని నొప్పించకండి.

                                          ◆నిశ్శబ్ద.