శశికళలో ఇంత కోపాగ్నియా..!

 

నాకు దక్కనిది ఎవరికీ దక్కడానికి వీల్లేదు అన్న డైలాగ్ శశికళకు బాగా సూట్ అయ్యేలా ఉంది. ఎందుకంటే నాకు సీఎం పీఠం దక్కకపోయినా పర్లేదు కానీ... పన్నీర్ సెల్వానికి మాత్రం సీఎం పదవి దక్కకుండా చేస్తానని చెప్పిన శశికళ ఇప్పుడు ఆ మాట నిజం చేసేందుకు ఏం చేయడానికైనా సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. తనను దోషిగా తేల్చుతూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఖిన్నురాలైన శశికళ.. ఆ తరువాత మాత్రం తనకు సీఎం పదవి దక్కకపోయినా పర్లేదు.. కానీ పన్నీర్ సెల్వంకు మాత్రం సీఎం పదవి దక్కనివ్వనని తన వర్గం ఎమ్మెల్యేల దగ్గర అన్నట్టు సమాచారం. ఇప్పుడు శశికళను చూస్తుంటే మాత్రం అది నిజం చేయకుండా ఉండేలా లేరు. ఇందుకు ఆమె మెరీనా బీచ్ వద్ద అమ్మ సమాధివద్ద శపథం చేయడం చూస్తుంటేనే అర్ధమవుతోంది.

 

సుప్రీంకోర్టు శశికళను వెంటనే లొంగిపోవాలని ఆదేశించిన నేపథ్యంలో బెంగుళూరు సెషన్స్ కోర్టు ఎదుట లొంగిపోయేందుకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆమె పోయెస్ గార్డెన్ నుండి బెంగుళూరు బయలుదేరారు. లొంగిపోయేముందు మెరీనా బీచ్ వద్ద అమ్మ సమాధి దగ్గర నివాళులు అర్పించడానికి వెళ్లిన శశికళ అక్కడ ఆవేశంతో శపథం చేశారు. ఇప్పుడు ఆమె శపథం చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎందుకంటే ఎంతో నెమ్మదిగా.. ఎంతో సౌమ్యంగా కనిపించే శశికళలో ఇంత కోపం ఉందా.. ఇంత ఆగ్రహమా అని ఆశ్చర్యపోతున్నారు. నివాళులు అర్పించేప్పుడు రౌద్రంగా కనిపించిన శశికళ.. పెదవులు బిగబట్టి, ఆమె సమాధిపై బలంగా కొడుతూ, శపధాలు చేసిన తీరు అక్కడున్న అన్నాడీఎంకే నేతలను ఆశ్చర్య పరిచింది. ఆమె ఏమేమి శపథాలు చేశారన్నది స్పష్టంగా తెలియనప్పటికీ, ఆమె ఉద్దేశం మాత్రం ఒకటేనని, పన్నీర్ సెల్వంకు అధికారం దక్కకుండా ఉండటం, పార్టీ విడిపోకుండా తాను సూచించిన వారికి సీఎం పదవి దక్కడమేనని అర్థమవుతోంది. మరి జైలు నుండి శశికళ ఎన్ని ఎత్తులు వేస్తారో చూద్దాం..