జయహో ఇస్రో

పేదరికం, అవినీతి, కుటుంబపరిపాలన, కులం పిచ్చి, నిస్తేజమైన ప్రభుత్వ యంత్రాంగాలు, నిర్వేదాన్ని కలిగించే న్యాయవ్యవస్థ... భారతదేశం అన్న పేరు వినగానే చాలామందికి గుర్తుకువచ్చేవి ఇవే! ప్రత్యేకించి ఏమన్నా గొప్పగా చెప్పుకోవాలన్నా వేల సంవత్సరాల క్రితపు చరిత్రను భుజానికి ఎత్తుకోవాల్సిందే. కానీ మన దేశం గురించి చెప్పుకొనేందుకు ఏముంది అన్న బాధ కలిగిన ప్రతిసారీ... భారతీయులు తల ఎత్తుకునేలా చేసిన సంస్థ ఇస్రో.

 

 


ఇస్రో ఏర్పడి ఇప్పటికి దాదాపు 50 ఏళ్లు పూర్తికావస్తోంది. ఏదో మిగతా దేశాల్లాగా ఇండియా కూడా తూతూమంత్రంగా ఓ అంతరిక్ష సంస్థని ఏర్పాటు చేసిందిలే అని ప్రపంచమంతా భావించింది. కానీ 1975లోనే ఆర్యభట్ట పేరుతో తొలి భారతీయ ఉపగ్రహాన్ని నిర్మించింది ఇస్రో. వేల ఏళ్లనాటి మన విజ్ఞాన స్ఫూర్తి ఇంకా చెక్కుచెదరలేదని నిరూపించింది. అది మొదలు ప్రపంచాన్ని ప్రతిసారీ ఆశ్చర్యపరుస్తూనే ఉంది.

 

 


దక్షిణాసియాలో సమాచార వ్యవస్థకు కొత్త అర్థాన్ని ఇచ్చిన INSAT ఉపగ్రహాలు (1983), ఉపగ్రహాలను సమర్థవంతంగా ప్రయోగించగల PSLV వ్యవస్థ, మన దేశానికి తనదైన నావిగేషన్‌ వ్యవస్థను అందించగల NAVIC ఉపగ్రహాలు... ఇలా ఏటికేడు ఇస్రో అందిస్తూ వచ్చిన అద్భుతాల జాబితా చాలా పెద్దదే. అరకొర సదుపాయాలతో, చాలీచాలని నిధులతోనే మంగళయాన్‌, చంద్రయాన్‌ వంటి భారీ ప్రణాళికలను సైతం సాకారం చేయగలిగారు.

 

 


ఇస్రో ఏదన్నా ప్రయోగాన్ని చేసిన ప్రతిసారీ... ప్రపంచంలో ఇది రెండోసారి, నాలుగోసారి అంటూ లెక్కలు వేసేవారు. కానీ ఈసారి ఇస్రో అంతకుమించిన అద్భుతాన్ని ఆవిష్కరించే సాహసం చేయనుంది. ఇప్పటివరకూ ఎవరూ సాధించని విధంగా ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించనుంది. వీటిలో మూడు ఉపగ్రహాలు మాత్రమే మనవి కావడం విశేషం. మిగతా ఉపగ్రహాలన్నీ ఇజ్రాయేల్‌, నెదర్లాండ్స్, స్విట్జర్‌లాండ్‌ వంటి దేశాలవి. ఇక ఏకంగా 96 ఉపగ్రహాలు అమెరికానుంచే వచ్చాయంటే మన ఇస్రో ప్రతిష్ట ఎంత ఎత్తున ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా విదేశాలకు చెందిన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేరవేర్చడం ద్వారా ఇస్రో కావల్సినన్ని నిధులను కూడా సేకరించగలుగుతోంది.

 

 

ఒకవైపు విదేశీ ఉపగ్రహాలను చేరవేస్తూనే మరోవైపు మన దేశ అవసరాల కోసమూ మూడు ఉపగ్రహాలను పంపుతోంది ఇస్రో. వీటిలో Cartosat-2 అనే ఉపగ్రహం మన శత్రువుల కదలికలను గమనించగల అద్భుతమైన సాధనం. మరో రెండు ఉపగ్రహాలేమో క్లిష్టమైన నానో టెక్నాలజీ సాయంతో రూపొందించినవి. ఇలా ప్రయోగించే సంఖ్యలోనే కాదు, అందులో ఉన్న ఉపగ్రహాల విషయంలో కూడా ఈ ప్రయోగం కీలకమైనదే! ఇన్ని ఉపగ్రహాలనూ ఒక్కసారిగా మోసుకువెళ్లడం, వాటిని వేర్వేరు కక్ష్యలలో ప్రవేశపెట్టడం అంటే మామూలు విషయం కాదు. 2014లో రష్యా 37 ఉపగ్రహాలను ఒక్కసారిగా ప్రవేశపెట్టగానే ప్రపంచమంతా ముక్కున వేలేసుకుంది. ఆ సంఖ్యని మించి ఉపగ్రహాలను పంపడం మరోసారి సాధ్యం కాదనుకుంది. కానీ భారత్‌ ఇప్పుడు అంతకు మూడురెట్ల అద్భుతాన్ని సాధించబోతోంది. ఇండియాలో మేధావులకు చోటు లేదనీ... కాస్తో కూస్తో బుర్ర ఉన్నవారంతా విదేశాలకు తరలిపోవాల్సిందే అని భ్రమించేవారి దిమ్మతిరిగేలా నిప్పులు చిమ్ముకుంటూ ఇస్రో అంతరిక్షంలో సరికొత్త అధ్యాయం సృష్టించబోతోంది.