మళ్లీ జైలుకి సంజయ్‌దత్?
posted on Feb 26, 2016 11:29AM

అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్న కేసులో సంజయ్‌దత్‌ను నిన్న ఎరవాడ జైలు నుంచి విడుదల చేసిన విషయం తెలిసిందే! సంజయ్‌దత్ కారాగారంలో ఉన్నప్పుడు ‘సత్ప్రవర్తన’తో మెలగడంతో ఆయనను ఎనిమిది నెలల ముందుగానే విడుదల చేసింది ప్రభుత్వం. అయితే ఈ విషయమై తీవ్ర నిరసనలు చెలరేగుతున్నాయి. సంజయ్‌దత్‌కు మొదటి నుంచీ కూడా ఇతర ఖైదీలకు లభించని వెసులుబాట్లను అందచేశారనీ, జైల్లో ఆయనను అపురూపంగా చూసుకున్నారనీ ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైగా సంజూబాబు ఇష్టం వచ్చినట్లు పెరోల్ మీద వచ్చి వెళ్లేవాడని కూడా అంటారు. ఇప్పుడు ఆయనను త్వరగా విడుదల చేయడం గురించి కూడా వివాదం రాజుకుంటోంది. ప్రదీప్ భలేకర్ అనే సామాజిక కార్యకర్త దీని గురించి ముంబై హైకోర్టులో ఒక కేసుని దాఖలు చేశాడు. సంజయ్‌దత్ విషయంలో ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరించిందనీ, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన తన శిక్షను పూర్తిచేసుకునేలా తిరిగి జైలుకి పంపించమనీ ఈ ఫిర్యాదులోని సారాంశం! ఈ కేసులో కోర్టు కనుక ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తే, మిగిలిపోయిన ఎనిమిది నెలల కాలాన్నీ జైళ్లో గడిపేందుకు సంజయ్ తిరిగి ఎరవాడకి బయల్దేరక తప్పదేమో!