తెలుగుదేశం గెలుపు గెలుపు కాదు.. మా ఓటమి ఓటమి కాదు.. సజ్జల నోట కొత్త భాష్యం

ఎన్నికలలో గెలుపు గెలుపే, ఓటమి ఓటమే. అది వైసేపీ అయినా మరోపార్టీ అయినా, గెలుపు ఓటములకు అనేక కారాణాలు ఉంటాయి. అయినా గెలుపు గెలుపే ఓటమి ఓటమే. అయితే గెలుపును ఎంజాయ్ చేసినంతగా ఓటమిని జీర్ణం చేసుకోవడం, సహజంగా అందరికీ సాధ్యం కాదు. అందులోనూ  వై నాట్ 175 అంటూ, రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో  గెలుపు తమదే అన్న పగటి కలలు కంటున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఆయన, ఏదన్నా, అంతేగా .. అంతేగా అంటూ తలలూపే సలహాదారులకు, ఎమ్మెల్సీ ఎన్నికలో ఎదురైనా చేదు అనుభవం మింగుడు పడడం కష్టమే.

అదీ గాక, పిచ్చోడి చేతిలో రాయి ఎవరి నెత్తిన పడుతుందో అనే భయం వల్ల కూడా కావచ్చు, సర్వ శాఖల మంత్రిగా ప్రసిద్దుడైన ప్రభుత్వ సలహాదారు  సజ్జల రామకృష్ణా రెడ్డి  పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలో టీడీపీ సృష్టించిన ప్రభంజనాన్ని తక్కువ చేసి చూపేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. పట్టభద్రుల స్థానాల్లో వైసేపీ ఘోర పరాజయాన్ని హుందాగా స్వీకరించేందు బదులుగా  సజజ్ల కుంటి సాకులు వెతుక్కోవడం ఏమిటని, వైసేపీ నేతలే అంటున్నారు. నవ్వుకుంటున్నారు. అవును. చదవేస్తే ఉన్నమతి పోయింది అన్నట్లు, టీడీపీ గెలుపు  గెలుపు కాదు, వైసేపీ ఓటమి ఓటమి కాదు అనే కొత్త భాష్యాన్ని సజ్జల తెర మీదకు  తెచ్చారు. 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావని, ప్రభుత్వ సజ్జల చెప్పుకొచ్చారు. పీడీఎఫ్ ఇతర వామపక్షాలకు చెందిన ఓట్లే టీడీపీ వైపు మళ్లాయన్నారు. ఎన్నికలు జరిగిన స్థానాలు అన్నింటినీ కలిపి చూడాలని సూచించారు. ఏ రకంగానూ ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిఫలించవన్నారు. టీడీపీ  సంబరాలు చేసుకోవడంతోనే అంతా అయిపోలేదని, ఈ ఫలితాలను తాము హెచ్చరికగా భావించడం లేదని సజ్జల స్పష్టం చేశారు.

ఈ ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదని తెలిపారు. ఒక వర్గం ఓటర్లను రాష్ట్రం మొత్తానికి ఎలా అపాదిస్తారని ప్రశ్నించారు. అంతే కాదు, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల పరిధిలో పట్టభద్రుల ఓటర్లు లేరని తెలిపారు. అంటే  వైసీపే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది, పేద ప్రజలను ఆదుకునేందుకో  పేదరిక నిర్మూలనకో కాదని  కేవలం ఓటు బ్యాంకును పెంచుకునేందుకే అనే నిజాన్ని సజ్జల అంగీకరించారు. నిజానికి సంక్షేమ పథకాల లబ్దిదారులంతా కట్టు బానిసల్లా మళ్ళీ  తమకే ఓటు వేస్తారనే భ్రమల్లోంచే, 175/175 భరోసా పుట్టుకొచ్చింది. కానీ, పట్టభద్రులైనా, పేద ప్రజలైనా  కేవలం సంక్షేమం మాత్రమే కోరుకోరు. అయినా సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ ఫలితాలను తాము హెచ్చరిక భావించడం లేదని, ప్రభుత్వ వ్యతిరేకతగా గుర్తించడం లేదని అంటున్నారు. అంటే నిజాన్ని అగీకరించేందుకు వైసీపే నాయకత్వం సిద్దంగా లేదని, అదే ఆ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యం అవుతుందని రాజకీయ పరిశీలకు విశ్లేషిస్తున్నారు.