అరెస్టా.. కాదా? సీబీఐ ఏం చేస్తుంది? అవినాష్ వ్యవహారంలో సర్వత్రా ఉత్కంఠ

వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో హైకోర్టు తెలంగాణ హైకోర్టు సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని తేల్చేసింది  దీంతో ఇక అవినాష్ రెడ్డి అరెస్టే తరువాయి అన్న భావనే సర్వత్రా వ్యక్తమౌతోంది. అయితే అదే రోజు సీఎం ఢిల్లీ వెళ్లి, పీఎంను కలిశారు.  దీంతో  సీబీఐ దూకుడు తగ్గిస్తుందా?  కొనసాగిస్తుందా అన్న మీమాంశ వ్యక్తమౌతోంది. సీఎం జగన్ ప్రధానిని కలిసిన తరువాత సీబీఐ నెమ్మదిస్తే అది ఆ దర్యాప్తు సంస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది.

 
కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయాలన్న, సీబీఐ ప్రయత్నాలకు కొద్దిరోజులు బ్రేక్‌ వేసిన తెలంగాణ హైకోర్టు, ఆ తరువాత  గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసింది. అవినాష్‌రెడ్డి అరెస్టులో జోక్యం చేసుకోలేం. ఈ విషయంలో సీబీఐదే తుది నిర్ణయమంటూ చేప్పేసిన తరువాత  ఇప్పుడు సీబీఐ వెనుకాడితే అది సీబీఐ ప్రతిష్టకు మచ్చ తీసుకురావడం ఖాయమన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమౌతోంది. అయితే.. కోర్టు అవినాష్ అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు వెలువరించిన రోజే.. బడ్జెట్ సమావేశాలను కూడా పక్కన పెట్టేసి హడావుడిగా హస్తిన కేగి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అయిన నేపథ్యంలో ఆయన పర్యటనపై పలు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.  అవినాష్‌రెడ్డి, అరెస్టును అడ్డుకునేందుకే జగన్‌ ఢిల్లీ వెళ్లారని విపక్షాలు ఆరోపించాయి. అలాగే అవినాష్ తోనే వదిలేయండి ఇంకా ముందుకు వద్దు అని వేడుకోవడానికే జగన్ హస్తిన వెళ్లారన్న వాదనా వినిపించింది. అయినా అవినాష్, ఆయన తండ్రి భాస్కరరెడ్డి ఇబ్బందులలో పడిన ప్రతి సారీ జగన్ హస్తిన పర్యటన పెట్టుకోవడం వెనుక కారణమేమిటని విపక్ష తెలుగుదేశం ప్రశ్నిస్తోంది.  సీబీఐపై ఒత్తిడి తీసుకువచ్చేందుకే జగన్‌, ఢిల్లీకి వెళ్లారన్నది విపక్షాల ఆరోపణ.

దీనితో  అందరి చూపు ఇప్పుడు  సీబీఐ తదుపరి చర్య ఏమిటా అన్న దానిపైనే పడింది. నిన్నటి వరకూ అవినాష్‌ అరెస్టు కోసం  పట్టుదల ప్రదర్శించిన   సీబీఐ.. ఇప్పుడు మోడీ-జగన్‌ భేటీ తర్వాత అదే వైఖరి కొనసాగిస్తుందా? అంటూ విపక్షాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి.  సీబీఐ అరెస్టు విషయంలో వెనక్కు తగ్గి, అవినాష్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు అవకాశం సమయం ఇస్తే.. జగన్ హస్తిన వెళ్లి చేసిన ప్రయత్నాలు ఫలించాయని భావించాల్సి ఉంటుంది. అలా కాకుండా అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తే జగన్ వెళ్లింది అవినాష్ రెడ్డి అరెస్టును అడ్డుకోవడానికి కాదు, రాష్ట్ర అంశాలను చర్చించేందుకేనని జనం భావించేందుకు ఆస్కారం అభిస్తుంది.