మిస్టరీ : కదిలే రాళ్లు

 

కాలిఫోర్నియాలో ఉన్న ఓ ఎడారి పేరు మృత్యు లోయ. ఆ ప్రాంతాన్ని దాటే ప్రయత్నంలో కొందరు చనిపోవడంతో దానికా పేరు వచ్చింది. అక్కడ శాశ్వతంగా నివసించే ప్రజలు తక్కువే అయినా... అక్కడ ఉండే కొండలు, లోయలను చూసేందుకు ఏటా లక్షలాది మంది మృత్యులోయను చేరుకుంటారు. అలా మృత్యులోయకి చేరుకునేవారికి ఓ విచిత్రం కనిపిస్తూ ఉంటుంది. అవే sailing stones.

 

అంతా మాయ

 

మృత్యులోయలోని ప్లేయా అనే ప్రాంతంలోకి చేరుకోగానే ఒక ఎండిపోయిన సరస్సు కనిపిస్తుంది. దీని మీద వందలాది రాళ్లూ కనిపిస్తాయి. అసలు వింత అది కాదు. ఈ రాళ్లన్నీ కూడా ఎవరో పనిగట్టుకుని లాగినట్లుగా స్థానం మారుతూ ఉంటాయి. శీతకాలం వస్తే చాలు కొన్ని వందల అడుగుల దూరానికి నిదానంగా జరుగుతుంటాయి. అలా రాళ్లు జరిగాయి అన్నదానికి సాక్ష్యంగా నేల మీద గీతలు ఉంటాయి.

 

వందేళ్ల రహస్యం

 

మృత్యులోయలోని రాళ్లు కదులుతున్నట్లు దాదాపు వందేళ్ల క్రితమే గమనించారు. కానీ దానికి కారణం ఏమిటన్నది ఎవరికీ తట్టనేలేదు. దాంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. గ్రహాంతర వాసులే వీటిని కదిపి వెళ్తున్నారనీ, ఏదో అయస్కాంత శక్తి ఉండటం వల్లే ఇలా జరుగుతోందనీ, ఆకతాయిల పని అనీ... ప్రచారాలు జరిగాయి. దాంతో కదిలే రాళ్ల వెనక ఉన్న రహస్యాన్ని ఛేదించేందుకు శాస్త్రవేత్తలంతా రంగంలోకి దిగారు.

 

తేలనే లేదు

 

300 కిలోలకు పైగా బరువున్న రాళ్లు ఒక్క ఏడాదిలోనే 800 అడుగులకు పైగా జరగడం, పరిశోధకులని సైతం ఆశ్చర్యపరచింది. ఎంత గాలి వీచినా కూడా ఇది అసాధ్యమే కదా! పైగా ఒకో రాయి ఒకోతీరున కదలడం మరో విశేషం. మృత్యులోయలో తరచూ కనిపించే గాలి దుమారాల వల్లే ఈ రాళ్లు కదులుతున్నాయని కొందరు శాస్త్రవేత్తలు భావించారు. అప్పుడప్పుడూ ఈ సరస్సులోకి నీరు రావడం వల్ల రాళ్లు కదులుతున్నాయని మరికొందరు నిర్ధరించారు. కానీ ఈ ఊహలేవీ పరీక్షకి నిలబడలేదు. దాంతో కదిలే రాళ్ల మీద ఓ కన్ను వేసి ఉంచేందుకు సరస్సులో చిన్నపాటి వాతావరణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ రాళ్ల కదలికలని నిశితంగా గమనించేందుకు, వాటికి బెజ్జాలు చేసి అందులో జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) యంత్రాలను అమర్చారు.

 

ఇంట్లోనే తేలిపోయింది

 

విజ్ఞాన ప్రపంచాన్ని ఇంతగా వేధించిన ఈ ప్రశ్నకి ఓ శాస్త్రవేత్త తన ఇంట్లోనే జవాబు కనుక్కోవడం ఆశ్చర్యం. రాల్ప్ లోరెంజ్ అనే శాస్త్రవేత్త ఈ ఘనత సాధించారు. ఒక గిన్నెలో నీరు పోసిన లోరెంజ్ అందులో ఓ రాయిని ముంచి ఫ్రిజ్లో ఉంచారు. ఆ నీరు గడ్డకట్టిన తరువాత, రాయి ఉన్న మంచు గడ్డని ఇసుక మీద బోర్లించారు. మంచుగడ్డ కదిలినప్పుడు దాంతో పాటుగా రాయి కూడా కదలడాన్ని లోరెంజ్ గమనించారు.

 

రాళ్ల చుట్టూ మంచు పేరుకోవడం ద్వారా, అవి నీటి మీద కాస్త ముందుకు సాగుతున్నాయని తేలిపోయింది. అలా కదిలేటప్పుడు ఒకోసారి అవి పక్కకి ఒరగడం వల్ల గతి మారే అవకాశం ఉందని అర్థమైంది. ఏడాదిలో చాలావరకు ఎండిపోయి ఉండే ఈ సరస్సులో వర్షం పడటం, శీతకాలంలో నీటి ఉపరితలం గడ్డకట్టడం, అలా గడ్డకట్టిన మంచు పలకల మధ్య ఉన్న రాళ్లు ముందుకు కదలడం..... అంతా కూడా చాలా నిశ్శబ్దంగా జరిగిపోతుంది కాబట్టి, ఇంతకాలం ఎవరూ వాటిని ప్రత్యక్షంగా గమనించలేకపోయారు. దాంతో అదేదో గొప్ప రహస్యంగా భావించేవారు. కానీ ఇప్పుడు అసలు విషయం తేలిపోయింది కదా! అయినా ఇప్పటికీ చాలామంది ఈ కదిలే రాళ్ల వెనుక ఏదో మాయ ఉందనే నమ్ముతున్నారట. మరి మీరో!!!

- నిర్జర.