రాజస్థాన్ కాంగ్రెస్ లో రచ్చకెక్కిన విభేదాలు
posted on Jun 7, 2023 10:32AM
రాజస్థాన్ కాంగ్రెస్ లో విభేదాలు మరో సారి రచ్చకెక్కాయి. ఈ సారి పార్టీ హైకమాండ్ కలగ జేసుకున్నా పరిస్థితులు సద్దుమణిగే అవకాశాలు కనిపించడం లేదు. రాజస్థాన్ కాంగ్రెస్ లో గత నాలుగున్నరేళ్లుగా ముఖ్యమంత్రి గెహ్లాట్, పార్టీ యువనేత సచిన్ పైలట్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితులే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడిన వేళ సచిన్ పైలట్ కీలెరిగి వాత పెట్టిన చందంగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు గట్టి షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఈ షాక్ రాష్ట్ర కాంగ్రెస్ కే పరిమితమయ్యే అవకాశాలు స్వల్పం. సచిన్ పైలట్ తీసుకోబోతున్న నిర్ణయం వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీపై జాతీయ స్థాయిలో కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు.
ఇక విషయానికి వస్తే.. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో సచిన్ పైలట్ కాంగ్రెస్ ను వీడి సొంత కుంపటి పెట్టుకోవడానికి రెడీ అయ్యారు. ఈ నెల 11న అంటే తన తండ్రి రాజేష్ పైలట్ వర్థంతి రోజునే కొత్త పార్టీ ప్రకటించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత ఎన్నికలలో రాజస్థాన్ లో కాంగ్రెస్ విజయం వెనుక కీలక శక్తి సచిన్ పైలటేననడంలో సందేహం లేదు. ఆ ఎన్నికల సమయంలో పీసీపీ చీఫ్ గా ఉన్న సచిన్ పైలట్ తన సర్వశక్తులూ ఒడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన ఆశించిన విధంగా సీఎం పదవి మాత్రం దక్కించుకోలేకపోయారు.
సీనియర్ అన్న ఒకే ఒక్క కారణంతో సిచిన్ పైలట్ ను కాదని కాంగ్రెస్ అధిష్ఠానం అప్పట్లో అశోక్ గెహ్లాట్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. అప్పటి నుంచీ అంటే ఈ నాలుగున్నరేళ్లుగా సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. గతంలోనే పార్టీ నుంచి బయటకు రావడానికి, లేదా పార్టీలో చీలిక తీసుకురావడానికి సిద్ధమైన సచిన్ పైలట్ అధిష్ఠానం జోక్యంతో వెనక్కు తగ్గారు. ఇటీవల సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్ర కూడా చేశారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం వారిద్దరినీ పిలిపించి.. సయోధ్య చేసి పంపింది. అంతా సద్దుమణిగందని అనుకునే లోపు సచిన్ పార్టీని వీడేందుకు డిసైడయ్యారు. లేదా ‘రాజ్ జన సంఘర్ష పార్టీ పేర కొత్త పార్టీని స్థాపించాలని సచిన్ పైలట్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.