ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ వైరాగ్యం ఎందుకంటే?
posted on Jun 7, 2023 10:11AM
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హఠాత్తుగా రాజకీయాల నుంచి గుడ్ బై చెప్పాలనిపిస్తోందంటూ వేదాంత ధోరణిలో మాట్లాడారు. తెలంగాణ రాజకీయాలలో వ్యాపారాత్మక ధోరణి ప్రబలిపోయిందని ఈ పరిస్థితుల్లో రాజకీయాలలో కొనసాగడం కష్టమని, మరీ ముఖ్యంగా తనలాంటి వారు ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలకు గుడ్ బై చెప్పడమే మేలని ఇంకా ఎన్నెన్నో మాటలు మాట్లాడారు.
వ్యాపారాత్మక రాజకీయాలు తనకు సెట్ కావన్న ఉత్తమ్ పోలిటికల్ రిటౌర్మెంట్ గురించి మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు సర్వత్రా సంచలనం సృష్టించాయి. ఏదో ఒక మంచి రోజు చూసుకొని రాజకీయాల నుంచి బయటకు వచ్చేస్తాననీ, మరీ ముఖ్యంగా 2018 నుంచి రాజకీయాలు చాలా కమర్షియలైజ్ అయ్యారనీ ఉత్తమ్ అంటున్నారు. అందుకే గౌరవంగా రాజకీయ రిటైర్మెంట్ ఆలోచన చేస్తున్నానని ఉత్తమ్ అన్నారు. తాను రాజకీయాల్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని.. అనుభవించిన పదవులు, పొందిన గౌరవం తనకు సంతృప్తినిచ్చాయనీ ఉత్తమ్ చెప్పుకున్నారు. అయితే ఇక వ్యాపారాత్మక రాజకీయాలలో కొనసాగే ఆసక్తి, ఉత్సాహం లేవంటూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాజకీయ సన్యాసం ప్రకటిస్తానని వెల్లడించారు.
రాజకీయ సన్యాసం ప్రకటిస్తానంటూ వైరాగ్యం మాట్లాడిన ఆయన మోడీ ఛరిష్మా తగ్గుతోందంటూ మరో రాజకీయ ప్రకటన కూడా ఇదే సందర్భంగా చేశారు. ఆయన ఏం మాట్లాడినా, ఎంతగా తనను తాను రాజకీయాలలో ఎనలేని సేవలు చేశానని చెప్పుకున్నా, ఆయన ప్రస్తుత రాజకీయ వైరాగ్యానికి కారణం కాంగ్రెస్ లో ఆయన ప్రాముఖ్యత నామమాత్రపు స్థాయికి పడిపోవడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సొంత పార్టీ శ్రేణులూ అదే అంటున్నాయి. కాంగ్రెస్ సీనియర్లే కాదు, జూనియర్లు సైతం ఇప్పడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పట్టించుకునే పరిస్థితి పార్టీలో కనిపించడం లేదు.