కేసీఆర్ నోట ఏపీలో చిమ్మ చీకట్ల మాట!

తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి తమ గొప్పలు చెప్పుకోవాలంటే ఏపీలో నెలకొన్న అధ్వాన పరిస్థితులను ప్రస్తావించడం పరిపాటిగా మారిపోయింది. అయితే ఆ పనిని ఇప్పటి  వరకూ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే చేశారు. ఇప్పుడు ఏపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం ద్వారా కేసీఆర్ కూడా గీత దాటేశారు. ఏపీలో పరిస్థితులు అద్వానంగా ఉన్నాయని ఏకంగా బహిరంగ సభలో చెప్పేశారు. పొరుగు రాష్ట్రం గురించి,  ఆ రాష్ట్రంలో పరిస్థితుల గురించి ఏకంగా ముఖ్యమంత్రే చెప్పారంటే ఏపీ పరువు ఏ గంగలో కలిసినట్లో ముఖ్యమంత్రి జగన్ వివరణ ఇవ్వాలి.

 ఔను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏపీలో చిమ్మ చీకట్లు నెలకొన్నాయని బహిరంగ సభ వేదికగా చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ వెలుగుజిలుగులతో విరాజిల్లుతుంటే.. ఏపీ మాత్రం చిమ్మ చీకట్లో మగ్గిపోతోందని అన్నారు. ఈ మాట ఏదో ఇష్టాగోష్టిగా తమ పార్టీ నాయకులతోనో, మంత్రివర్గ సహచరులతోనో మాట్లాడుతూ కాదు.. ఒక బహిరంగ సభా వేదిక మీద నుంచి చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ లో జరిగిన బహిరంగ సభ వేదిక మీద నుంచి ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఏపీ గురించి తెలంగాణ ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆగ్రహం ఏపీ వాసుల నుంచి వ్యక్తం కావడం లేదు. ఆయన చెప్పింది వాస్తవమే కదా అన్న వ్యాఖ్యలే జనం నుంచి వినవస్తున్నాయి. గతంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఏపీలో విద్యుత్ పరిస్థితి గురించి, రోడ్ల దుస్థితి గురించి ఏకంగా ఇన్వెస్టర్ల సదస్సులోనే విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. 2014లో రాష్ట్ర విభజన తరువాత ఐదేళ్ల పాటు ప్రతి అంశంలోనూ, ప్రతి విషయంలోనూ తెలంగాణను అధిగమించిన ఏపీ.. ఆ తరువాత ఇలా అన్ని రంగాలలోనూ వెనుకబడిపోవడానికీ, పొరుగు రాష్ట్రం నేతలు ఏపీ పరిస్థితుల గురించి చులకనగా వ్యాఖ్యలు చేసినా ఏపీ సర్కార్ ఖండించలేని దుస్థితిలో ఉండడానికీ కారణమేమిటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ నిర్విరామంగా అందుతుంటే.. ఏపీలో మాత్రం అడ్డగోలు కోతలతో  జనం ఆగమాగం అయిపోతున్నారు. జూన్ మొదటి వారం గడిచిపోయినా ఎండల తీవ్రత ఇసుమంతైనా తగ్గకపోవడం, డిమాండ్ కు సరపడా విద్యుత్ సరఫరా చేయలేక ఏపీ చేతులెత్తేయడాన్ని కేసీఆర్ ఎత్తి చూపారు తప్పేముందని ఏపీ జనమే అంటున్నారు.  అయితే కేసీఆర్  ఆంధ్రప్రదేశ్ లో అద్వాన పరిస్థితుల గురించి ప్రస్తావించడం ఇదే మొదటి సారి కాదు.   అలాగే తెలంగాణ, ఏపీ మధ్య పాలన సామర్ధ్యంలో తేడాల గురించి చెప్పడంలో మంత్రలు కేటీఆర్, హరష్ రావు  కీలకమైన పెట్టుబడులు ఇతర సమావేశాల్లో  ప్రస్తావించి ఏపీలో ఏపీలో అన్ని రకాల పరిస్థితుల్ని చూపించి భూతల నరకం అంటే ఏపీయే అని చెబుతున్నారు. ఆ పరిస్థితులు రాష్ట్రంలో లేవని ఖండించే ధైర్యం కూడా  లేకుండా పోయింది. మొదటి సారి కేటీఆర్ ఏపీలో అద్వాన పరిస్థితుల గురించి విమర్శించిన సందర్భంగా  ఏపీలో కొంత మంది మంత్రులు నామ్ కే వాస్తే ఖండించి ఆ తరువాత సైలంట్ అయిపోయారు. జగన్ కేసీఆర్ మధ్య కొనసాగుతున్న స్నేహ బంధమే ఏపీ మంత్రుల సైలెన్స్ కు కారణమని పరిశీలకులు అప్పట్లో విశ్లేషించారు. కానీ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ పాలనలో ఏపీ అధ్వానంగా ఉందని విమర్శలు గుప్పిస్తున్నా.. ఏపీ సీఎం జగన్ కానీ, మంత్రులు కానీ నోరెత్తకపోవడాన్ని కూడా పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో ఏపీ ముఖ్యమంత్రికి ఉన్న సంబంధాలే కారణమని ఎవరైనా ఎలా సరిపెట్టుకోగలరు?  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu