ఆర్టీసీ బిల్లు.. తమిళిసైకి కార్మికుల నిరసన సెగ!

తమిళనాడు గవర్నర్, పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై తెలంగాణ సర్కార్ మధ్య చాలా  విభేదాలు నిన్నా మొన్నటివి కావు. దాదాపుగా మూడేళ్లుగా  రాజ్ భవన్, బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్ అన్నట్లుగానే పరిస్థితి ఉంది. ఎప్పుడో  హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా తమిళిసై, కేసీఆర్ ముఖాముఖి ఎదురుపడ్డారు. అంతే అంతకు ముందు, తర్వాతా కూడా ఇరువురి మధ్యా సంబంధాలు ఉప్పూ నిప్పులాగే  ఉన్నాయి.

కేసీఆర్ సర్కార్ అవమా నిస్తోందని తమిళిసై పలు సందర్భాలలో బహిరంగంగా ప్రకటనలూ చేశారు.  గవర్నర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపిం చారు. ఇది అనేక సందర్భాల్లో బయట పడిందన్నారు.ప్రభుత్వం చాలాసార్లు కావాలని ఇబ్బంది పెట్టినా తాను భయపడలేదని గవర్నర్ తమిళి సై తెలిపారు. తనపై ఎందుకిలా వ్యవహరిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు.  గవర్నర్ కార్యాలయానికి ప్రభుత్వం గౌరవం ఇవ్వడం లేదనీ ఆరోపించారు.  గవర్నర్ కార్యాలయం అయిన రాజ్ భవన్ పై ప్రభుత్వం వివక్ష కొనసాగుతోందని అన్నారు. ప్రభుత్వం ప్రోటోకాల్ ను తుంగలో తొక్కిందన్నారు.  ఇక బీఆర్ఎస్ మంత్రులు కూడా గవర్నర్ పై విమర్శలు గుప్పించారు. తమిళసై రాజ్ భవన్ ను బీజేపీ కార్యాలయంగా మార్చేశారన్నారు. మొత్తంగా రాజకీయ ప్రత్యర్థుల స్థాయిలో గవర్నర్ బీఆర్ఎస్ ల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సాగాయి. ఈ పరిస్థితి గత మూడున్నరేళ్లుగా కొనసాగుతూనే ఉంది.

రాజ్యాంగ బద్ధంగా తన కున్న అధికారాలను వినియోగించుకుని పలు సందర్భాలలో గవర్నర్ తమిళిసై కేసీఆర్ సర్కార్ కు షాక్ లు ఇచ్చారు.  బిల్లులను తిరస్కరించకుండా వెనక్కు తిప్పి పంపకుండా తన వద్దే ఉంచుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. తాజాగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ బిల్లును గవర్నర్ కు పంపితే దానిపై తనకు సందేహాలున్నాయని నివృత్తి చేయాలని తిప్పి పంపారు. ఇటీవల వరదలు సంభవించి రాష్ట్రంలోని అనేక గ్రామాలు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతాలను గవర్నర్ సందర్శించి ప్రభుత్వ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. గత సంవత్సరం కూడా ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును గవర్నర్ తిప్పి పంపించిన విషయం తెలిసిందే. తాజాగా.. ఈ శాసన సభ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలనుకున్న ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలుపలేదు.

ఆర్థికపరమైన బిల్లు కావడంతో ప్రభుత్వం గవర్నర్‌కు పంపింది. దీంతో ప్రభుత్వానికి గవర్నర్ మరోసారి షాకిచ్చినట్లైంది. ఎన్నికల ఏడాదిలో కేసీఆర్ సర్కర్ కు గవర్నర్ తీసు ఒకింత ఇబ్బందికరంగానే పరిణమించిందనడంలో సందేహం లేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్న కేసీఆర్ కు ఆ బిల్లును గవర్నర్ తిప్పి పంపడంతో  ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యిందనే చెప్పాలి. ప్రోటోకాల్ పాటించనందుకు గవర్నర్ తమిళిసై ఇచ్చిన రిపార్టీలా దీనిని పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. గవర్నర్ నిర్ణయంపై రాజకీయ విమర్శల కంటే ఆర్టీసీ కార్మికులను నిరసనలకు ప్రోత్సహించడం ద్వారా రాజకీయ మైలేజ్ పొందాలని యోచిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu