ఆర్టీసీ విలీనం.. బీజేపీకి సంకటం!
posted on Aug 5, 2023 1:44PM
ఉరుము ఉరిమి మంగళం మీద పడటం అంటే ఆదే అని ఇప్పుడు బీజేపీ వాపోతోంది. ఇటీవలి కాలంలో తెలంగాణలో బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే తరువాయి అన్న స్టేజి నుంచి ఇప్పుడు ఉనికి కాపాడుకుంటే చాలనుకునే స్థితికి దిగజారిందని పరిశీలకలు విశ్లేషిస్తున్నారు.
కర్నాటక ఫలితాల తరువాత తెలంగాణలో బీజేపీది బలం కాదు వాపు అన్న సంగతి, ఆ పార్టీ నేతల ప్రకటనలలోని డొల్ల తనం ప్రస్ఫుటంగా బయటపడ్డాయి. అన్నిటికీ మించి బీజేపీ, బీఆర్ ఎస్ ల మధ్య రహస్య సంబంధాలున్నాయన్న విమర్శలకు బలం చేకూరింది. అదే సమయంలో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుని బీఆర్ఎస్ కు దీటుగా నిలబడే స్థాయికి ఎదిగింది. పార్టీలో విభేదాలు సమసిపోయి సమష్టిగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయంపై గవర్నర్ తమిళిసై లేవనెత్తిన సందేహాల కారణంగా కార్మికుల్లో వ్యక్తమౌతున్న ఆందోళన బీజేపీకి శరాఘాతంగా మారిందనే చెప్పాలి.
ఆర్టీసీ విలీనం బిల్లు ఈ సమావేశాల్లో ఆమోదం కాకపోవడం వెనుక ఉన్నది బీజేపీయే అన్న ఆగ్రహం కార్మికుల్లో వ్యక్తం అవుతోంది. కేసీఆర్ ఆర్టీసీ విలీనం నిర్ణయాన్ని కేబినెట్ లో ఆమోదించి.. వెంటనే బిల్లు రూపొందించేసి గవర్నర్ ఆమోదం కోసం పంపించారు. మంగళవారం గవర్నర్ ఆమోదానికి పంపించి వెంటనే అసెంబ్లీలో ప్రవేశ పెట్టేయాలన్న ఆత్రత, ఉత్సాహం కనబరిచారు. అయితే ఆ బిల్లుకు సంబంధించి కొన్ని కొర్రీలు చూపుతూ గవర్నర్ దానిని వెనక్కు పంపారు. దీంతో బిల్లు ప్రభుత్వం కోర్టులోకి వచ్చింది. బిల్లుకు సంబంధించి గవర్నర్ లేవనెత్తిన సమాధానాలన్నిటికీ సమాధానాలిస్తూ మళ్లీ గవర్నర్ కు పంపించినా ఆమె ఔట్ ఆఫ్ హైదరాబాద్ కావడంతో దానిని అసెంబ్లీలో ప్రవేశ పెట్టి వెంటనే ఆమోదం పొందే అవకాశం లేకపోయింది.
ఇది కచ్చితంగా కేసీఆర్ సర్కార్ ను ఇరకాటంలో పడేస్తుంది. దీంతో దీనికీ రాజకీయ రంగు పులిమి కేసీఆర్ సర్కార్ ఆర్టీసీ కార్మికుల ఆగ్రహాన్ని గవర్నర్ పైకి మళ్లించే ప్రయత్నం చేసింది. గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ ను బీజేపీ కార్యాలయంగా మార్చేశారంటూ బీఆర్ఎస్ నేతలు, మంత్రులు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీయే ఆర్టీసీ కార్మికులకు మేలు చేయకుండా అడ్డు పడుతోందని బీఆర్ఎస్ ఆరోపణలు మొదలెట్టేశారు.
దీంతో గవర్నర్ బిల్లును వెనక్కు పంపిస్తూ తీసుకున్న నిర్ణయం బీజేపీని డిఫెన్స్ లో పడేసింది. హడావుడిగా బిల్లు రూపొందించి గవర్నర్ కు పంపడమేమిటని బీజేపీ గట్టిగా బీఆర్ఎస్ సర్కార్ ను నిలదీయలేని పరిస్థితుల్లో పడింది. ఆర్టీసీ బిల్లు లో ఏదో ఓ లొసుగు పెట్టి కేసీఆర్.. విలీనాన్ని ఆలస్యం చేస్తున్నదన్న విషయాన్ని కూడా గట్టిగా చెప్పలేని పరిస్థితుల్లో పడ్డారు. అదే సమయంలో ఆర్టీసీ విలీనం జాప్యం కావడానికి బీజేపీయే కారణమన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నది.