కేఏ పాల్ కాదు ఇక విశాఖ పాల్!

కేఏ పాల్.. ఈ పేరు గురించి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.  గతంలో మత ప్రభోధకుడిగా ఒక వెలుగు వెలిగిన పాల్.. దేశ విదేశాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇప్పటికీ దేశాల ప్రధానులను, అధ్యక్షులను ఎలాంటి అపాయింట్ మెంట్ కూడా లేకుండా కలవగలిగిన సత్తా ఉన్న వ్యక్తిని తానని  ఆయనే చెప్పుకుంటారు.

ఇక  ఎన్నికల సమయంలో పాల్ చేసే స్టంట్స్, ఇచ్చే ఇంటర్వ్యూలకు సోషల్ మీడియాలో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఆయన మాటలనే ఇతర రాజకీయ పార్టీలు కూడా ట్రోల్స్ కోసం వాడేంతగా ఆయన ఎన్నికల సమయంలో ప్రజలను ఎంటర్ టైన్ చేస్తుంటారు. వినోదం పంచుతుంటారు. ఈయనకున్న క్రేజ్ దృష్ట్యా కొన్ని మీడియా సంస్థలు కూడా ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూలను ప్లాన్ చేసి ప్రచారం చేస్తున్నాయంటే ఆయన సేలబులిటీ ఎంతో అర్ధమౌతుంది.  ఆయన మాట్లాడే మాటలు వైరల్ అయితే, ఆయన ఇంటర్వ్యూలు పెద్ద సంఖ్యలో  వ్యూస్ తెస్తాయి.

కాగా  ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హీట్ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు ప్రాంతాలలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళికలు రచించుకొనే పనిలో ఉన్నారు. ఎన్నికల హీట్ మొదలైందో లేదో పాల్ మళ్ళీ రంగంలోకి దిగిపోయారు. ఈసారి ఆయన విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. తాను పక్కా లోకల్ అని చెప్పుకున్నారు. విశాఖలో తనకంటే మంచి అభ్యర్థి లేరని.. ఈసారి పోటీ చేసి తీరుతానని గట్టిగా చెప్పారు. ఇక నుంచి ఇక్కడే మకాం పెడతానని, తన రాజకీయం ఎలా ఉంటుందో ఇక్కడి రాజకీయ పార్టీలకు చెబుతానని సవాల్ విసిరారు.

ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంలోని బీజేపీకి తొత్తుగా మారాయని.. విశాఖపట్నంకి మేలు చేసే పార్టీ ఒక్కటీ లేదని, అందుకే తాను బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు.

మరి రెండు తెలుగు రాష్ట్రాలలో ఇన్ని సీట్లు ఉండగా విశాఖనే ఎందుకు ఎంచుకున్నారంటే.. విశాఖ దగ్గర తగరపువలస తన సొంత ప్రాంతమని అందుకే ఇక్కడ నుంచి పోటీ చేసి ఈ ప్రాంత సమస్యలు తీర్చాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాదు విశాఖ ఎదుర్కొంటున్న సమస్యలు ఇక్కడి పరిస్థితులు తనకంటే ఎక్కువగా ఏ నాయకులకు తెలుసని ప్రశ్నిస్తున్నారు. ఆరు నూరైనా నూరు పదహారైనా 2024 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని.. ఇదే సమయంలో తనదే గెలుపు అని ధీమా వ్యక్తం చేసిన పాల్.. తాను ఇక మీదట కేఏ పాల్ ను కాదని విశాఖ పాల్ ని అని.. తనని అందరూ అలాగే పిలవాలని కూడా కోరుతున్నారు.

నిజానికి తెలుగు రాష్ట్రాలలో కేఏపాల్ చెప్పే మాటలు అందరినీ నవ్వుల్లో ముంచుతుంటాయి. మత ప్రబోధకుడిగా ఆయనకి చాలా దేశాలలో గుర్తింపు ఉన్న మాట నిజమే కానీ.. దాన్ని ఆయన చెప్పే తీరు చూసేవారికి కామెడీగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే గతంలో ఆయన కూడా హుందాగానే మాట్లాడేవారు. కానీ, ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఇలా కామెడీ పీస్ అయిపోయారు. ప్రజాశాంతి పార్టీ పెట్టిన తర్వాత ఆయన మాట్లాడే మాటలు సహజంగానే తెగ ట్రోల్ అయిపోతున్నాయి. తాను తలచుకుంటే ఎవరినైనా సీఎంను చేస్తానని.. అవసరమైతే రెండు రాష్ట్రాలను దత్తత తీసుకుంటానని ఆయన చెప్పే డైలాగ్స్ ఎక్కువగా యూత్ లో ఎంటర్ టైన్మెంట్ పార్ట్ అయిపొయింది. 

కాగా, పాల్ ప్రకటించిన విశాఖ పార్లమెంట్ విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడ వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన మధ్యే పోటీ ఉండేలా ఉంది. టీడీపీ జనసేన పొత్తులు ఇంకా ఖరారు కాకపోగా.. బీజేపీ మరోవైపు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని బరిలో నిలబెట్టే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ పొత్తు ఖరారైనా ఆమెకు సీటు ఖాయం, గెలుపు ఖాయం అనే ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బలహీన పడ్డారు. ఆ మధ్య దుండగులు ఈ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఘటన సంచలనంగా మారగా.. ఇప్పుడు ఎంవీవీ హైదరాబాద్ కు మకాం మార్చినట్లు తెలుస్తుంది. ఆయన స్థానంలో వైసీపీ మరొకరిని దింపేందుకు కసరత్తులు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu