కాబుల్ ఎయిర్‌పోర్టుపై రాకెట్లతో దాడి.. అమెరికా ఏం చేసిందంటే...
posted on Aug 30, 2021 11:33AM
అది కాబుల్ ఎయిర్‌పోర్ట్. ఎప్పటిలానే దేశం విడిచి వెళ్లేందుకు వేలాది మంది అఫ్గనిస్తానీలు అక్కడ గుమ్మికూడి ఉన్నారు. పౌరుల తరలింపు ప్రక్రియలో అమెరికన్ సైనికులు బిజీగా ఉన్నారు. కాబుల్ విమానాశ్రయం దగ్గర బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించడంతో అంతా హైఅలర్ట్‌గా ఉన్నారు. ఇటీవల ముష్కరులు వాహనంలో బాంబులతో వచ్చి ఆత్మాహుతి దాడి జరిపి 100 మందికి పైగా పొట్టనపెట్టుకున్న ఘటనతో యూఎస్ ఆర్మీ మరింత అలర్ట్‌గా ఉంది. కానీ, ఉగ్రవాదులు ఈసారి అనూహ్యంగా విరుచుకుపడ్డారు. వాహనంతో కాకుండా రాకెట్ లాంఛర్లతో ఎయిర్‌పోర్ట్‌పై అటాక్ చేశారు. ఒకటి రెండు కాదు 5 రాకెట్లను విమానాశ్రయంపైకి ప్రయోగించారు.
ఊహించని ఈ అటాక్‌ను అమెరికా చాలా ఈజీగా ఫేస్ చేసింది. నేరుగా ఎదుర్కొంటే యూఎస్ ఆర్మీని ఎవరూ ఏమీ చేయలేదు. ఆత్మాహుతి దాడిలాంటి దొంగ దెబ్బ తీస్తేనే ప్రాబ్లమ్. ఉగ్రవాదులు రాకెట్లు ప్రయోగించగానే.. కాబుల్ ఎయిర్‌పోర్టులో ఉన్న ఆమెరికాకు చెందిన క్షిపణి రక్షణ వ్యవస్థ ఆటోమెటిక్‌గా యాక్టివ్ అయింది. ముష్కరులు ప్రయోగించిన రాకెట్లు విమానాశ్రయం వరకు రాకుండానే.. చాలా దూరంలోనే వాటిని కూల్చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
కాబుల్ ఎయిర్‌పోర్టుకు దూరంగా ఓ వాహనం నుంచి ఈ రాకెట్లను ప్రయోగించినట్లు తెలిసింది. రాకెట్ల దాడికి పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. పేలుడు శబ్దాలతో ఎయిర్‌పోర్టు దగ్గర ఉన్న అఫ్గాన్ పౌరులు భయాందోళనలతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు.
కాబుల్ ఎయిర్‌పోర్టుకు కిలోమీటర్ దూరంలో ఆదివారం ఇలానే ఓ రాకెట్ దాడి జరిగింది. ఆ ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మరోవైపు కాబుల్‌లో భారీ ఉగ్ర కుట్రను అమెరికా ఆర్మీ భగ్నం చేసింది. ఆదివారం ఎయిర్‌పోర్టు దగ్గర ఆత్మాహుతి పేలుళ్లకు పాల్పడేందుకు ఓ వాహనంలో ముష్కరులు దూసుకురావడాన్ని గమనించిన అమెరికా బలగాలు.. డ్రోన్ దాడితో వారిని మట్టుబెట్టారు. అఫ్గాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ మంగళవారంతో ముగియనుండటంతో.. ఇక మళ్లీ వాళ్లు తమకు దొరకరు అన్నట్టు.. యూఎస్ ఆర్మీ టార్గెట్‌గా ఉగ్రవాదులు వరుస దాడులతో విరుచుకుపడుతున్నారు. దీంతో.. అమెరికా సైన్యం ప్రతీక్షణం ఫుల్ అలర్ట్‌తో ఉంటోంది.