చదువు కోసమా ‘బరువు’ కోసమా? స్కూల్స్ తెరుస్తోంది ఎందుకోసం..?

సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో పాఠశాలలు తెరవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పాఠశాలలు తెరిచేందుకు ఇదే సరైన సమయమని అన్నారు. ఆన్లైన్ బోధనతో పూర్తి స్థాయి ప్రయోజనాలు నెరవేరడం లేదని, అందుకే ప్రత్యక్ష బోధన అని వివరణ ఇచ్చారు. నిజమే, ఆన్లైన్ బోధనతో పూర్తి స్థాయి ప్రయోజనాలు నెరవేరడం లేదనడంలో నిజముంది. సరైన సదుపాయాలు,గాడ్గేట్స్ లేక ఇతర సాకేతిక సదుపాయాలు అందుబాటులో లేక కొందరు, అన్నీ ఉన్నా సరైనా అజామాయిషి లేక ఇంకోదరు పిల్లలు చదువుకు కొంత దూరం అవుతున్న మాట నిజమే. అయితే, ఏ ప్రమాణాల మీద ఆధారపడి మంత్రిగారు, పాఠశాలలు తెరిచేందుకు ఇదే సరైన సమయమనే  నిర్ణయానికి వచ్చారో మాత్రం అర్థం కావడం లేదని తల్లి తండ్రులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. 

ఓ వంక కరోనా థర్డ్ వేవ్ తప్పదన్న వార్తలొస్తున్నాయి, కేంద్ర  ప్రభుత్వం కూడా రాష్ట్రాలను హెచ్చరించింది. కొవిడ్ మార్గదర్శకాలను సెప్టెంబర్ 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ  చేసింది. రాష్ట్రంలోనూ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని చెప్పే పరిస్థితి లేదు. వాక్సినేషన్ కార్యక్రమం కూడా అంత జోరుగా ఏమీ సాగడం లేదు. అసలు పిల్లల వాక్సిన్ రానేలేదు. థర్డ్ వేవ్ వస్తే, పిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని, చాలా వేగంగా విస్తరిస్తుందని అన్ని వైపులా నుంచి హెచ్చరికలు వస్తున్నాయి.ఇలా ఏ కోణం నుంచి చూసినా రెడ్ మార్కే కనిపిస్తోంది. అయినా, విద్యాశాఖ మంత్రి  పాఠశాలలు తెరిచేందుకు ఇదే సరైన సమయమని అంటున్నారు. అయితే, ప్రభుత్వం ఎందుకోసం, ఏమి ఆశించి విద్యాశాఖ  ఇలాంటి ప్రమాదకర నిర్ణయం తీసుకుందో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికే తెలియాలని తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. చివరకు విద్యాశాఖ అధికారులు కూడా ప్రభుత్వం పెద్ద ప్రమాదాన్ని స్వాగతిస్తోందా, అనే  ఆందోళనలోనే ఉన్నారు.  అలాగే, ప్రైవేటు యాజమాన్యాలు చూపెట్టిన ‘బరువు’కు ప్రభుత్వం తలొగ్గిందనే  అనుమానాలు కూడా వ్యక్త మవుతున్నాయి. 

విద్యా మంత్రి సబితా ఇంద్రరెడ్డి మాత్రం ఇంట్లో మాదిరిగానే, విద్యా సంస్థలలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అంటున్నారు. హామీ ఇస్తున్నారు. అదే సమయంలో పిల్లలను స్కూల్స్’కు పంపి తీరాలనే, నియమం ఏదీ లేదని, తల్లి తండ్రులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అంటున్నారు. అంటే, పరోక్షంగా రేపు ఏదైనా జరగరానిది జరిగితే, బాధ్యతను తల్లి తండ్రుల మీద నెట్టి, తప్పించుకునేందుకు ప్రభుత్వం ఈ మెలిక పెట్టిందా, అనే అనుమానం వ్యక్తమవుతోంది.   అయితే వాస్తవ పరిస్థితిని గమనిస్తే, చాలా వరకు పాఠశాలలో పరిస్థితులు అద్వాన్నంగా ఉన్నాయి. టాయిలెట్స్, రన్నింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేని పాఠశాలలో, కొవిడ్ నిబంధనలను పాటిస్తామని చెప్పడం అంటే, అది ఆత్మ వంచన అనిపించుకుంతుందే తప్ప మరొకటి కాదని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులే అంటున్నారు.అన్ని క్లాసులు ఒకే సారి కాకుండా  అంచెల వారీగా ప్రారంభిస్తే కొంతవరకు బాగుండేదనే మాట కూడా ఉపాధ్యాయుల నుంచి వినవస్తోంది. 

మరోవంక  మరి కొద్ది గంటల్లో పాఠశాలలు తెరుచుకుంటున్నా, కొవిడ్ నిబంధనలు, శానిటేషన్’కు సంబంధించి ఆదేశాలు జరేచేసినా,   స్కూళ్ల నిర్వహణ గురించి మాత్రం సర్కారు ఇంకా ఆదేశాలివ్వలేదు. వారంలో ఎన్ని రోజులు స్కూల్ నడపాలి, క్లాస్‌‌కు ఎంతమంది స్టూడెంట్స్ ఉండాలి, బెంచ్‌‌కు ఎంత మందిని కూర్చోబెట్టాలి, రోజు విడిచి రోజు క్లాసులా, రోజూ నడపాలా, ప్రైమరీ పిల్లల విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి లాంటి ప్రశ్నలు యాజమాన్యాలను వెంటాడుతున్నాయి. సర్కారు గైడ్ లైన్స్ లేకపోవడంతో కొన్ని స్కూళ్లు పాత పద్ధతినే పాటించాలని భావిస్తున్నాయి. మరికొన్ని స్కూళ్లు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాయి. 

అయితే తల్లి తండ్రులు మాత్రం ఇంకా చాలావరకు డోలాయమాన స్థితిలోనే ఉన్నారు. రిస్క్ తీసుకోలేమని కొందరు అంటుంటే, స్కూల్స్’కు తెరిచినా, భౌతిక తరగతులకు సమాంతరంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తే మంచిదని, అలా చేయడం వలన తక్కువ మంది పిల్లలతో పాఠశాలల నిర్వహణ కొంత మేరకు మెరుగ్గా ఉంటుందని..కొందరు పేరెంట్స్ అంటున్నారు. అలాగే, ముందు కాలేజీ తరగతులు ప్రారంభించి పరిస్థితిని బట్టి కింది తరగతులు ప్రారంభించడం ఉత్తమం అని కూడా కొందరు సూచిస్తున్నారు. ఇదలా ఉంటే ప్రైవేటు స్కూల్ లో పనిచేసే ఉపాధ్యాయుడు ఒకరు, ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యార్ధులకు భౌతిక తరగతులు నిర్వహించడం వలన ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే అవుతుందని, పేర్కొంటూ రాష్ట్ర హై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిల్ పై ఆగష్టు 31న రాష్ట్ర హై కోర్టు, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామ చంద్రరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుంది. ఈ నేపధ్యంలో, తల్లితండ్రులు, విద్యాశాఖ అధికారులు కోర్టు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu