రేవంత్ సెక్యూరిటీ సమూల మార్పు.. కారణమేంటంటే..?
posted on Jan 24, 2024 3:33PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్యూరిటీ విషయంలో ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బందిని మొత్తం మార్చేసింది. ఆయనకు సంబంధించిన సమాచారం లీకౌతోందన్న సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద పని చేసిన ఏ ఒక్క అధికారినీ, పోలీసు సిబ్బందినీ సీఎం సెక్యూరిటీలో భాగం చేయవద్దని నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వం బుధవారం (జనవరి 24)న సీఎం రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బందిని పూర్తిగా మార్చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా ఈ పరిణామం ఇంత హఠాత్తుగా చోటు చేసుకోవడం పై పలు కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఇచ్చిన సమాచారం మేరకే రేవంత్ సెక్యూరిటీ సిబ్బందిని మొత్తం మార్చి వేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందని అంటున్నారు.
వాస్తవానికి గత కొంత కాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత, అధికారిక సమాచారం లీకౌతున్నదన్న ఆరోపణలు వినవస్తూనే ఉన్నాయి. ప్రధానంగా రేవంత్ నిర్ణయాలు, ఆయన ఎవరెవరిని కలుస్తున్నారు, ఏయే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు అన్న సమాచారం మాజీ సీఎం కేసీఆర్ కు ముందుగానే చేరుతోందన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి భద్రత విషయంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఆయన భద్రతా సిబ్బందిని సమూలంగా మార్చివేసిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే సెక్యూరిటీ సిబ్బంది మార్పు నిర్ణయం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ తో భేటీ అయిన గంటల వ్యవధిలో వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ వర్గాలలో ఇదో హాట్ టాపిక్ గా మారిపోయింది.
ప్రధానంగా రేవంత్ రెడ్డితో భేటీ అయిన నలుగురు ఎమ్మెల్యేలూ మెదక్ జిల్లాకు చెందిన వారే కావడం, ఆ నలుగురూ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సన్నిహితులు కావడంతో వారు కాంగ్రెస్ తలుపు తడుతున్నారా? ఆ పార్టీకి చేరువకావడానికి ప్రయత్నిస్తున్నారా అన్న చర్చ మొదలైంది. తమపై నమ్మకం కలగడానికే రేవంత్ సెక్యూరిటీ నుంచే సమాచారం లీకౌతోందన్న విషయాన్ని రేవంత్ చెవిన వేశారా అన్న అనుమానాలు రాయకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నాయి.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ బీఆర్ఎస్ నుంచి పలువురు కాంగ్రెస్ గూటికి చేరేందుకు రెడీగా ఉన్నారన్న వార్తలు వినవస్తూనే ఉన్నాయి. సీనియర్ కాంగ్రెస్ నేతలు, మంత్రులు కూడా పలు సందర్భాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రేవంత్ ను నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంతో సహజంగానే వారు కారు దిగిపోనున్నారని అంతా భావించారు. తాము కేవలం మర్యాద పూర్వకంగానే రేవంత్ ను కలిశామనీ, నియోజకవర్గ సమస్యలు, ప్రొటోకాల్ వంటి అంశాలపై ఆయనతో చర్చించామనీ, అవసరమైతే మరో వంద సార్లు కలుస్తాం కానీ కారు దిగి చేయి అందుకునే ప్రశ్నే లేదనీ వారు స్పష్టం చేసినప్పటికీ రాజకీయవర్గాలలో మాత్రం సందేహాలు నివృత్తి కాలేదు. రేవంత్ సెక్యూరిటీని సమూలంగా మార్చేయడం వెనుక వారిచ్చిన సమాచారమే ఉందన్న సందేహాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి.