కేంద్ర బడ్జెట్ పై రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
posted on Jul 5, 2019 6:54PM

ఈ రోజు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2019 -20 బడ్జెట్‌పైన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎప్పటిలాగే బడ్జెట్‌లో దక్షిణాది రాష్ట్రాలపై కేందంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపించిందని ఆరోపించారు. తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎలాంటి కేటాయింపులు చేయలేదన్నారు. అలాగే విద్య, వైద్యం కోసంఎలాంటి కేటాయింపులు చేయకపోవడం చాలా దురదృష్టకరం అన్నారు. ఇక నిధుల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ రూ.1 పన్ను కడితే.. కేంద్రం తిరిగి వారికి రూ.2 ఇస్తోందని అలాగే బీహర్ రూ.1 పన్ను కడితే.. కేంద్రం తిరిగి రూ.1 ఇస్తోందన్నారు. అదే దక్షిణాది రాష్ట్రాలు రూ.1 పన్ను కడితే.. 65 పైసలే తిరిగి ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.పేద, మధ్య తరగతి వర్గాలకు ఈ బడ్జెట్ తో ఒరిగేది ఏమీ లేదని, వారికి కనీస ఊరట కూడా లభించలేదని ఆయన అన్నారు. ఆర్ధిక మంత్రి దక్షిణ భారత దేశానికి చెందినవారే అయినా.. ఆమె మోదీ చేతిలో కీలుబొమ్మలా మారిపోయారని ఆరోపించారు.